అణ్వస్త్రాల నివారణ అతిపెద్ద సవాల్
మిచిగన్, విస్కోన్సిస్ కార్యక్రమాల్లో ట్రంప్
పాటర్‌విల్లే/వెల్లింగ్టన్ : అధ్యక్ష ఎన్నికల్లో తనను గెలిపిస్తే మహిళలకు ఉచితంగా ఐవీఎఫ్ చికిత్స అందిస్తానని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మిచిగన్‌లో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వస్తే ఐవీఎఫ్ సేవలను ఉచితం చేస్తా, అందుకు ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని లేదంటే మీ బీమా కంపెనీలు చెల్లిస్తాయి’ అని అన్నారు. ‘మనకు మరింత మంది పిల్లలు కావాలి. నేను శ్వేతసౌధంలో అడుగు పెట్టిన తర్వాత అందరికీ ఐవీఎఫ్ చికిత్సను ఉచితం చేస్తా’ అని ప్రకటించారు. సంతానలేమి సమస్య అధికంగా ఉన్న దృష్ట్యా ఐవీఎఫ్‌కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడిరది. అలాగే విస్కోన్సిస్ రాష్ట్రంలోని టౌన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ అణ్వస్త్రాల వినియోగాన్ని నివారించడమన్నది అతిపెద్ద సమస్యగా ఉందని ట్రంప్ అన్నారు. ‘సమీప భవిష్యత్‌లో అణు యుద్ధాన్ని నిరోధించడమన్నది అమెరికాకు, అంతర్జాతీయ సమాజానికి అతిపెద్ద సవాలు. అణ్వాయుధాలు ప్రమాదకరం. వాటి వల్ల సంభవించే వినాశనాన్ని ఊహించలేం. ఆ ఆయుధాలు ఎప్పటికీ వినియోగించకుండా చేయాలి’ అని తెలిపారు. ప్రపంచ సుస్థిరతకు దౌత్య పద్ధతిని/ సంప్రదింపుల విధానాన్ని అనుసరిస్తానని చెప్పారు. విజ్ఞతతో వ్యవహరిస్తా… ఫోన్‌లు చేయడం ద్వారా సత్సంబంధాలను ఏర్పాటు చేసుకుంటా’ అని అన్నారు. అమెరికా, రష్యా అతిపెద్ద అణుశక్తులు కాగా వచ్చే ఐదేళ్లలో చైనా కూడా ఈ జాబితాలో చేరగలదని అంచనా వేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అణ్వాయుధాల నిరోధానికి సంబంధించి రష్యాతో చర్చలను ట్రంప్ జరుపుతారని పార్టీ వర్గాలు వెల్లడిరచాయి.