అబుజా : ఇంధనం, రక్షణ పరిశ్రమ, మైనింగ్, హైడ్రోకార్బన్‌ల వంటి ఎనిమిది ద్వైపాక్షిక ఒప్పందాలపై బుధవారం నైజీరియా అధ్యక్షుడు మొహమ్మద్ బుహారీ, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ సంతకాలు చేశారు. నైజీరియా, టర్కీల మధ్య స్నేహపూర్వక సంబంధాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా నైజీరియా రాజధాని అబుజాలో జరిగిన విలేకరుల సమావేశంలో రెండు దేశాల నాయకులు పాల్గొన్నారు. ఎర్డోగాన్ ఆఫ్రికాలో రెండు రోజుల పర్యటన కోసం మంగళవారం నైజీరియా రాజధాని అబుజా వచ్చారు. సవరించిన కొవిడ్19 ప్రొటోకాల్ ఆధారంగా నైజీరియా తన ప్రయాణ నిషేధ జాబితా నుంచి టర్కీని తొలగించినట్లు బుహారీ తెలిపారు. కొవిడ్ నియంత్రణలో టర్కీ అద్భుతమైన విజయాన్ని సాధించిందని నైజీరియా అధ్యక్షుడు పేర్కొన్నారు. టర్కీ నైజీరియాతో సంబంధాలను అన్ని రంగాలలో ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలని నిశ్చయించారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం 2020లో 2 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ వాణిజ్య పరిమాణాన్ని 5 బిలియన్ డాలర్లకు విస్తరించాలని ఎర్డోగాన్ ఆకాంక్షను వ్యక్తం చేశారు. టర్కీ అధ్యక్షుడు అంకారా తీవ్రవాదంపై నైజీరియాతోపాటు సైనిక, రక్షణ, భద్రతా రంగాల్లో మరింత సహకరిస్తానని హామీ ఇచ్చారు. టర్కిష్
ఆఫ్రికన్ భాగస్వామ్య సమావేశం డిసెంబరులో జరుగుతుందని ఎర్డోగాన్ తెలిపారు.