ఢాకా: బంగ్లాదేశ్‌లో పరిపాలన మార్పు దిశగా చర్యలు వేగవంతమయ్యాయి. ఇప్పటికే ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రాజకీయ వర్గాలతో సంప్రదింపులు జోరందుకున్నాయి. ఆపద్ధర్మ ఏర్పాటు చేసేందుకుగాను అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ మంగళవారం పార్లమెంటును రద్దు చేశారు. జనవరి 7న జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏర్పాటైన 12వ పార్లమెంటును రద్దు చేస్తూ ఆదేశాలిచ్చారు. అంతకుముందు త్రివిధ దళాధిపతులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, విద్యార్థి నాయకులతో అధ్యక్షుడు చర్చలు జరిపినట్లు స్థానిక మీడియా తెలిపింది. జులై 1 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు అరెస్టుకు గురైన ‘కోటా’ నిరసనకారుల విడుదల ప్రక్రియ కూడా మొదలైనట్లు పత్రికా ప్రకటన పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో షేక్ హసీనాకు రాజకీయ ప్రత్యర్థి, దేశానికి తొలి మహిళా ప్రధాని ఖలీదా జియాకు గృమ నిర్బంధం నుంచి విముక్తి లభించడం చర్చనీయాంశంగా మారింది. ఆమె తిరిగి రాజకీయాల్లోకి చక్రం తిప్పుతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఆగని హింస
బంగ్లాదేశ్‌లోని జషోర్ జిల్లాలో ఒక హోటల్‌పై జరిగిన దాడిలో 24 మంది దుర్మరణం చెందారు. అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి షాహిన్ చక్లాదర్‌కు చెందిన జబీర్ ఇంటర్నేషనల్ హోటల్‌కు అల్లరిమూకలు నిప్పు పెట్టగా 24 మంది సజీవ దహనమైనట్లు స్థానిక మీడియా తెలిపింది. మృతుల్లో ఇండోనేసియా పౌరుడు ఉన్నట్లు పేర్కొంది. 21 రోజులుగా కొనసాగుతున్న ఆందోళనల కారణంగా వందలాది మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మరణాల సంఖ్య 440కి చేరుకుంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సైన్యం తీవ్రంగా యత్నిస్తోంది.
అదనపు అటార్నీ జనరల్ రాజీనామా
బంగ్లాదేశ్ అదనపు అటార్నీ జనరల్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు న్యాయవాది ఎస్‌కే మహమ్మద్ ముర్షద్ వెల్లడిరచారు. వ్యక్తిగత సమస్యలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను అధ్యక్షుడికి అందజేశారు. వ్యక్తిగత సమస్యలు, అనారోగ్యం కారణంగా రాజీనామా చేస్తున్నట్లు లేఖలో ముర్షద్ పేర్కొన్నట్లు డైటీ స్టార్ నివేదించింది.
హసీనాకు భారత్ సహకారం
షేక్ హసీనా రాజకీయ శరణార్థిగా బ్రిటన్ ఆశ్రయం కోరారు. బ్రిటన్ ప్రభుత్వ అనుమతులు వచ్చేవరకు ఆమె భారత్‌లో ఉండనున్నారు. ఇందుకోసం న్యూదిల్లీ తాత్కాలిక అనుమతులు ఇచ్చింది. హసీనాకు సంస్థాగతంగా సహకారాన్ని ఆందిస్తోంది. బంగ్లాదేశ్ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తోంది. భద్రతా దళాలు గగనతలంపై నిఘా వేశాయి. అటువైపు నుంచి వచ్చే విమానం భారత్‌లోకి సురక్షితంగా ప్రవేశించేలా చూడాలని నిర్ణయించాయి. ఇదే క్రమంలో భారత్ గగనతలంలోకి ప్రవేశించినప్పుడు షేక్ హసీనాకు రఫేల్ యుద్ధవిమానాలు రక్షణ కల్పించాయి. పశ్చిమ బెంగాల్‌లోని హాసీమారా వైమానిక స్థావరం నుంచి వెళ్లిన 101 స్వ్కాడ్రన్ రఫేల్ విమానాలు… షేక్ హసీనా విమానం ఉత్తరప్రదేశ్‌లోని హిండన్ విమానాశ్రయంలో దిగే వరకు వెంట వెళ్లాయి. ఈ పరిణామాలన్నింటినీ భారత త్రివిధ దళాధిపతులు నిశితంగా గమనించారని సమాచారం. విమానాశ్రయంలో హసీనాకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ స్వాగతం పలికారు. అనంతరం ఆమెతో గంటసేపు చర్చించారు. భవిష్యత్ కార్యాచరణ గురించి తెలుసుకున్నారు.
ఐరాస దర్యాప్తునకు బ్రిటన్ సూచన
బంగ్లాదేశ్ పరిస్థితులను బ్రిటన్ నిశితంగా గమనిస్తోంది. ఈ పరిణామాలపై ఐక్యరాజ్య సమితి (ఐరాస్) అధ్వర్యంలో దర్యాప్తు జరిపించాలని సూచన చేసింది. బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ శాంతియుతంగా సాగాలని కోరుకుంటున్నట్లు బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి ఒక ప్రకటన చేశారు. షేక్ హసీనా తమ దేశంలో రాజకీయ శరణార్థిగా ఆశ్రయం కోరడం గురించి ప్రస్తావించలేదు. హసీనా సోదరి రెహానా బ్రిటన్ పౌరురాలు కాగా ఆమె కుమార్తె తులిప్ సిద్దీఖీ లేబర్ పార్టీ ఎంపీ. బ్రిటన్‌లో లేబర్ పార్టీనే అధికారంలో ఉంది.