బీజింగ్‌్: గతంలో చైనా అధిక జనాభా ఉన్న దేశాల్లో మొదటి స్థానంలో ఉండేది. జనాభా నియంత్రణకు అప్పట్లో అధికార వర్గాలు చర్యలు తీసుకోవడంతో క్రమంగా జననాల సంఖ్య తగ్గడంతో అధిక జనాభా ఉన్న దేశంగా భారత్ ప్రథమస్థానంలోకి వచ్చింది. తాజా లెక్కల ప్రకారం చైనాలోని జనాభా సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఒకవైపు జననాల రేటు పడిపోతుండగా మరోవైపు వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. అక్కడ పెళ్లిళ్లు కూడా తగ్గుముఖం పడుతుండ టంతో ప్రభుత్వ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఈ ఏడాది తొలి ఆరునెలల్లో 34 లక్షల జంటలు మాత్రమే ఒక్కటయ్యాయని అధికారులు పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం వివాహాల సంఖ్య 4.98 లక్షలు తగ్గిందని తెలిపారు. చైనాలో రోజురోజుకు ఉద్యోగావకాశాలు తగ్గుతుండటం దీనికి కారణమని, ఉద్యోగాల్లో స్థిరపడిన అనంతరమే వివాహాలు చేసుకోవాలనే ఆలోచన, యువకుల సంఖ్య తగ్గుముఖం పట్టడం, ఖర్చులు ఎక్కువ కావడం, మారుతున్న నిర్ణయాలు వివాహాల నమోదు తగ్గడానికి కారణాలని పేర్కొన్నారు. 2014 నుంచి దేశంలో వివాహాల సంఖ్య తగ్గుతూ వస్తోందని, కోవిడ్ మహమ్మారి అనంతరం మరింత తగ్గుదల కనిపిస్తోందని అందోళన వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం ఆరు నెలల్లో కనిష్టంగా 34 లక్షల జంటలు మాత్రమే వివాహ బంధంలోకి అడుగుపెట్టాయని తెలిపారు. భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశం ఉండొచ్చని, దీనిని నివారించడానికి తగిన చర్యలు తీసుకోవడానికి యోచిస్తున్నామన్నారు. కొన్నేళ్లుగా చైనాలో జననాల రేటు తగ్గిపోతుండటంతో ఆందోళన వ్యక్తం చేసిన ప్రభుత్వం… దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. పెళ్లిళ్లు చేసుకునేవారికి, పిల్లలు కనేవారికి రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించింది. అయినప్పటికీ యువత పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడం లేదని తెలుస్తోంది.