52 మంది దుర్మరణం
52 మంది దుర్మరణం
ఢాకా : బంగ్లాదేశ్ రాజధాని ఢాకా శివారులో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. నారాయణ్ గంజ్ రూప్‌గంజ్‌లోని ఆరు అంతస్తుల షెజాన్ జ్యూస్ ఫ్యాక్టరీలో జరిగిన దుర్ఘటనలో 52మంది కార్మికులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు వెల్లడిరచారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఫ్యాక్టరీలో గురువారం సాయంత్రం 5గంటలకు మంటలు చెలరేగినట్లు సమాచారం. క్రింది అంతస్తులో ప్రారంభమైన మంటలు వేగంగా పై అంతస్తులకు వ్యాపించినట్లుగా తెలుస్తోంది. ఈ కర్మాగారంలో రసాయనాలు, ప్లాస్టిక్ బాటిళ్లు ఉండటంతో మంటలు భవనం అంతా వ్యాపించినట్లు అధికారులు వెల్లడిరచారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి 18 అగ్నిమాపక దళాలు పనిచేస్తున్నాయని, సహాయక చర్యలు ముమ్మరం చేశారని అధికారులు తెలిపారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నవారి కుటుంబ సభ్యులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఫ్యాక్టరీలో సరైన భద్రతా చర్యలు పాటించకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు నిరసించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియడానికి ఐదుగురు సభ్యులు దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. అగ్నిప్రమాదంలో మరణించిన వారి కుటుంబసభ్యులు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసించారు. కొంతమంది ఆందోళనకారులు రోడ్లపై వాహనాలను ధ్వంసం చేశారు.