వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఆయన కొత్త పుస్తకం ‘సేవ్ అమెరికా’ కూడా దూసుకుపోతోంది. విడుదలైన కొద్దిగంటల్లోనే అమెజాన్ బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. 92.06 డాలర్ల భారీ ధర ఉన్నప్పటికీ అమెజాన్‌లో ‘ప్రెసిడెంట్స్ అండ్ హెడ్స్ ఆఫ్ ది స్టేట్ బయోగ్రఫీస్’ జాబితాలో తొలిస్థానంలో నిలిచింది. మొత్తంగా 13వ స్థానంలో ఉంది. అధ్యక్షుడిగా తన పదవీకాలం, ప్రచార సమయంలోని విశేషాలను పుస్తకంలో ట్రంప్ పొందుపరిచారు. జులైలో పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో ట్రంప్ ప్రసంగిస్తుండగా ఓ యువకుడు కాల్పులు జరపడం, రక్తమోడుతున్న గాయంతో ఒక్కక్షణం నిర్ఘాంతపోయిన ట్రంప్… ఆ వెంటనే తేరుకొని వేదికపై పిడికిలి బిగించి, ఫైట్ అంటూ నినదిస్తున్న సమయంలో తీసిన ఫొటో నెట్టింట్లో విపరీతంగా చక్కర్లు కొట్టింది. ఆ దృశ్యాన్నే ఆయన కవర్ పేజ్‌పై వాడారు. అప్పటి జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్‌తో ఉన్న ఫొటోలను ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు అంతర్జాతీయ మీడియా కథనం పేర్కొంది. అలాగే మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌పై విమర్శలు, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీని సమర్థించుకోవడం ఇందులో కనిపిస్తుందని తెలిపింది. తన గత పదవీకాలంతో పాటు మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైతే ఎలాంటి పాలన అందించాలని ఆయన యోచిస్తున్నారో ఈ పుస్తకంలో పేర్కొన్నారు. ‘సేవ్ అమెరికా’లో తన తొలిపాలనకు సంబంధించిన ముఖ్యఘట్టాలు పొందుపరిచారు. పన్నులు, అంతర్జాతీయ దౌత్యం, సరిహద్దు భద్రత వంటి అంశాలను ప్రస్తావించారని అమెజాన్ వెల్లడిరచింది. ఈ పుస్తకం గురించి తన సోషల్ మీడియా యాప్ ‘ట్రూత్’లో ట్రంప్ ప్రమోట్ చేసుకున్నారు. అందులో పొందుపరిచిన ప్రతిఫొటోను తానే ఎంపిక చేసినట్లు చెప్పారు. దేశభక్తులు ఈ చరిత్ర తెలుసుకోవడం తప్పనిసరనే అర్థంలో పోస్టు పెట్టారు.