వెల్లువెత్తిన ప్రజాందోళనలు
బ్రెసిలియా : కరోనా వైరస్ మహమ్మారితో బ్రెజిల్‌లో మరణాల సంఖ్య ఐదు లక్షలు దాటింది. కరోనా వ్యాప్తి నియంత్రణలో బొల్సొనారో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ రాజధాని బ్రెసిలియాతో పాటు అన్ని నగరాల్లో ఆందోళనలు జరిగాయి. సావోపోలోలో భారీ ప్రదర్శన జరిగింది. అధ్యక్షుడు బొల్సొనారో వెంటనే రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండు చేశారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే లక్షలాది మంది కరోనాతో మరణించారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా గర్హించారు. బొల్సొనారో పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక సమస్యలను ఆందోళనకారులు ఎత్తిచూపారు. ప్రజలకు టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. బొల్సొనారో ప్రభుత్వాన్ని దించేందుకు ఐదు లక్షల కారణాలు ఉన్నాయన్న బ్యానర్‌ను ప్రదర్శించారు. ఈ బ్యానర్ అందరి దృష్టిని ఆకర్షించింది. బొల్సొనారోతోపాటు ఇతర ఉన్నతాధికారులు బాధ్యత వహించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ప్రదర్శనలో బొల్సొనారోతోపాటు జైలు ఖైదీల దుస్తులు ధరించిన ఆయన కుమారుడు కటౌట్లను ప్రదర్శించారు. బ్రెజిల్‌లో ఇప్పటివరకు 1.8 కోట్ల మందికిపైగా కరోనా బారిన పడ్డారు. అమెరికా తరువాత అత్యధిక కరోనా బాధితుల సంఖ్య బ్రెజిల్‌దే…రోజుకు లక్ష కేసులు, 2వేల మరణాలు నమోదవుతున్నాయి.