ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ మద్దతు
ఐరాస: ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు అంతర్జాతీయంగా మరింత మద్దతు లభిస్తోంది. భారత్‌కు ఫ్రాన్స్ మద్దతు ప్రకటించింది. మారుతున్న కాలానికనుగుణంగా భద్రతా మండలి మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని, భారత్ వంటి దేశాలకు కచ్చితంగా స్థానం కల్పించాలని సూచించింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభాలను పరిష్కరించడం ఐరాసకు తీవ్ర సవాలుగా మారిందని వార్తలు వినిపిస్తున్న వేళ ఫ్రాన్స్ ఈ విధంగా వ్యాఖ్యానించింది. ‘భద్రతా మండలి విస్తరణకు ఫ్రాన్స్ అనుకూలం. భారత్, జర్మనీ, జపాన్, బ్రెజిల్‌కూ శాశ్వత సభ్యత్వం ఉండాలి. ఆఫ్రికా నుంచి రెండు దేశాలకు ప్రాతినిధ్యం కల్పించాలి’ అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ సూచించారు. ఐరాస సర్వసభ్య సమావేశాల్లో ప్రసంగించిన ఆయన… ఐరాస భద్రతా మండలి సమర్థతను పునరుద్ధరించడానికి కేవలం ఈ మార్పులు సరిపోవన్నారు. యూఎన్‌ఎస్‌సీ అవలంబిస్తున్న విధానాల్లో మార్పులు రావాల్సి ఉందని ఫ్రాన్ అధ్యక్షుడు అభిప్రాయపడ్డారు. సామూహిక నేరాల కేసుల్లో వీటో అధికారాలకు పరిమితులు, శాంతి నెలకొల్పేందుకు అవసరమైన వ్యూహాలపై దృష్టి పెట్టడం వంటి మార్పులు రావాలన్నారు. క్షేత్రస్థాయిలో కార్యాచరణ చేపట్టేందుకు సమయం ఆసన్నమైందని మెక్రాన్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగి ఉన్న విషయం తెలిసిందే.