ఢాకా: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్… అతివాద సంస్థ హెఫాజత్-ఎ-ఇస్లాం నాయకుడు మమునుల్ హక్, అతని గ్రూప్ సభ్యులతో సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఆన్‌లైన్‌లో వెలుగులోకి వచ్చాయి. మమునుల్ హక్… రెచ్చగొట్టే ప్రకటనలు చేయడంతో పాటు భారత వ్యతిరేక వైఖరి అనుసరిస్తుంటారు. అలాంటి నేతతో యూనస్ సమావేశం కావడం, ఎన్నికల గురించి చర్చించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల బంగ్లా రాజధాని ఢాకాలో ఈ సమావేశం జరిగింది. హింసను ప్రేరేపిస్తున్నారన్న ఆరోపణలతో కొన్ని అభియోగాల కింద మనుముల్ హక్‌ను మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం జైలులో బంధించింది. అయితే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఆందోనళలతో ఆమె ఇటీవల గద్దె దిగాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. అనంతరం ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం… హక్‌తో పాటు అనేకమంది అతివాద నేతలను విడుదల చేసింది. ఇప్పుడు వారితోనే యూనస్ సమావేశమయ్యారు. ఎన్నికల సంస్కరణలు, సకాలంలో ఎన్నికల నిర్వహణ వంటి అంశాలను వారితో చర్చించారు. ఇదిలాఉంటే… బంగ్లాదేశ్‌లో భారత్ వ్యతిరేకిగా పేరొందిన మతతత్వ పార్టీ జమాతే ఇస్లామీపై హసీనా విధించిన నిషేధాన్ని కూడా ఎత్తివేసిన సంగతి తెలిసిందే. జమాతేకు మతతత్వ పార్టీగా పేరుంది. రాజకీయ కారణాలతోనే జమాతే ఇస్లామీపై హసీనా ప్రభుత్వం నిషేధం విధించిందని, అందుకే దాన్ని ఎత్తివేస్తున్నామని ప్రస్తుత ప్రభుత్వం వెల్లడిరచింది. మరోవైపు భారత్- బంగ్లా సంబంధాలపై జమాతే ఇస్లామీ అధినేత షఫీకుర్ రహమాన్ మాట్లాడుతూ భారత్‌తో స్నేహపూర్వక సంబంధాలనే తాము కోరుకుంటున్నామని తెలిపారు. అయితే ద్వైపాక్షిక సంబంధాల పేరుతో ఇతర దేశాల అంతర్గత అంశాల్లో జోక్యం చేసుకోవడం భారత్ మానుకోవాలన్నారు. అమెరికా, చైనా, పాకిస్థాన్‌తోనూ బంగ్లా సన్నిహిత సంబంధాలు నెరపాలని రహమాన్ తెలిపారు.