కారకస్: అమెరికా, లాటిన్ అమెరికాతో పాటు వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురోపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచేందుకు యూరోపియన్ యూనియన్ (ఈయూ) సిద్ధమైంది. అధ్యక్ష ఎన్నికల్లో మదురో సాధించిన విజయాన్ని గుర్తించేందుకు నిరాకరిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. వెనిజులాకి చెందిన నేషనల్ ఎలక్షన్ కౌన్సిల్ ప్రకటించిన ఎన్నికల ఫలితాలు గుర్తించబడవని ఈయూ కౌన్సిల్ ఓ ప్రకటనలో తెలిపింది. అధికారిక ఓటింగ్ రికార్డుల పూర్తి ప్రచురణను ఆలస్యం చేసే ఏదైనా ప్రయత్నం వారి విశ్వసనీయతపై సందేహాన్ని కలిగిస్తుందని పేర్కొంది. ప్రతిపక్షం ప్రచురించిన ఎన్నికల ఓటింగ్ రికార్డుల కాపీలను అనేక స్వతంత్ర సంస్థలు సమీక్షించాయని, ప్రతిపక్ష నేత ఎడ్మండ్ గొంజాలెజ్ గణనీయమైన మెజారిటీతో అధ్యక్ష ఎన్నికలలో విజేతగా నిలిచినట్లు సూచిస్తున్నాయని ఈయూ ప్రకటన పేర్కొంది. వీలైతే అంతర్జాతీయంగా ప్రసిద్ధి పొందిన స్వతంత్ర సంస్థతో ఎన్నికల రికార్డుల ధృవీకరణ చేపట్టాలని పేర్కొంది. వివరణాత్మక ఓట్ల లెక్కలు విడుదల చేయాలని ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్‌తో కూడిన ఈయూ దేశాలు కోరుతున్నాయి. వెనిజులా అధ్యక్ష ఎన్నికలపై ఆడిట్ నిర్వహించాలని ఇప్పటికే అధ్యక్షుడు నికొలస్ మదురో వెనిజులా హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఎన్నికల్లో తాను సాధించిన విజయంపై అమెరికా అనుకూల ప్రతిపక్ష నేతలు నానా యాగీ చేస్తున్న సంగతి తెలిసిందే. న్యాయం కోసం తానే న్యాయస్థానాన్ని ఆశ్రయించానని మదురో వ్యాఖ్యానించారు. తనను కోర్టుకు పిలవాలని, ప్రశ్నించాలని, సత్యాన్ని వివరించాలని కోరారు. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని ఆరోపించారు.