కొస్టారికా, ఈక్వెడార్, కొలంబియా, పనామా
గ్లాస్గో/స్కాట్లాండ్ : మధ్య అమెరికాలోని పశ్చిమ తీర ప్రాంతాలైన కొస్టారికా, ఈక్వెడార్, కొలంబియా, పనామా దేశాలు సముద్ర పర్యావరణ వ్యవస్థను సంరక్షిస్తామని రక్షణ, నిర్వహణ కోసం ప్రతిపాదించిన మార్గదర్శక ప్రకటనపై ఆయా దేశాల అధ్యక్షులు మంగళవారం సంతకాలు చేశాయి. ఐరాస వాతావరణ మార్పు సదస్సు(కాప్26)లో కోస్టారికా అధ్యక్షుడు కార్టోస్ అల్వరాడో ప్రతిపాదించిన ఈ ప్రకటన కీలక మైలురాయిగా సభ్య దేశాలు పరిగణించాయి. ఈ నాలుగు ద్వీప దేశాలు వాటిని కలిపే కారిడార్‌ల మధ్య మెరైన్ బయోస్పియర్ రిజర్వ్ ఏర్పాటు కానుంది. మహాసముద్రాలను రక్షించుకోవడానకి ప్రపంచానికి స్పష్టమైన సందేశాన్ని అందించడానికి లాటిన్ అమెరికాకు చెందిన ఈ నాలుగు దేశాలు మరింత ఐక్యంగా ముందుకు సాగాలని ఈ దేశాల నాయకులు సంకల్పించారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ప్రకృతి రక్షణ ఒక ప్రాథమిక దశగా పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా వందలాది సముద్ర జాతులను రక్షించడానికి ఆరోగ్యకరమైన మహాసముద్రాలు ముఖ్యమైనవిగా పేర్కొన్నారు. ఈ ద్వీపాల మధ్య జలాలు జీవసంబంధమైన కారిడార్లుగా పని చేస్తున్నాయి. ఈ జలాల ద్వారా సొర చేపలు, ట్యూనాలు, తాబేళ్లు, తిమింగలాలు అనేక ఇతర వలస సముద్ర జాతులు ఇతర దేశాలకు రవాణా అవుతాయి. ఈ నేపథ్యంలో సముద్ర వారసత్వాన్ని కాపాడేందుకు ఈ నాలుగు దేశాలు ప్రతిజ్ఞ చేశాయి.