ఖార్టూమ్ : సూడాన్‌ను రాజకీయ సంక్షోభంలోకి నెట్టిన సైనిక కుట్రను నిరసిస్తూ సూడాన్ ప్రజాస్వామ్య అనుకూల గ్రూపులు పెద్దఎత్తున ప్రజాందోళనలకు, నిరసనలకు పిలుపిచ్చాయి. సూడానీస్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్, ఫోర్సెస్ ఫర్ ది డిక్లరేషన్ ఆఫ్ ఫ్రీడం అండ్ ఛేంజ్ కూటమి ఈ నిరసనలకు పిలుపిచ్చింది. దేశవ్యాప్తంగా వేలాదిమంది ఈ ప్రదర్శనల్లో పాల్గొన్నారు. తక్షణమే పౌర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పౌర పాలనను పునరుద్ధరించాలని నినదించారు. సైనిక జనరల్స్‌పై ఒత్తిడి తీసుకువచ్చేలా ప్రతిరోజూ సూడాన్ వీధుల్లో నిరసనలు జరుగుతూనే వున్నాయి. నియంత ఒమర్ అల్ బషీర్ నేతృత్వంలో సూడాన్ అణచివేతకు గురికావడంతో అంతర్జాతీయంగా ఏకాకి అయిన తర్వాత ప్రజాస్వామ్య పాలనకు మారింది. కానీ సైన్యం అధికారాన్ని స్వాధీనం చేసుకొంది. నిరసిస్తున్న ప్రజలపై పోలీసులు అణచివేత చర్యలు తీసుకోవడంతో 90మంది మరణించారు. వీరిలో ఎక్కువమంది యువకులే. ఈ నిరసనల్లో వేలాదిమంది గాయపడ్డారు. సైనిక జనరల్స్‌పై ఒత్తిడి తేవడం కోసం పశ్చిమదేశాలు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు సూడాన్‌కు ఆర్థిక సాయాన్ని నిలిపివేశాయి. దేశంలో నెలకొన్న రాజకీయ స్తంభనను పరిష్కరించకపోతే ఆర్థిక, భద్రతా వైఫల్యం దిశగా దేశం సాగుతుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది.