విశాలాంధ్ర`విజయవాడ : సామ్రాజ్యవాదం కుట్రల నుంచి ప్రపంచ దేశాలను రక్షించి సోషలిజం వైపు పయనించడమే మార్క్స్, ఎంగెల్స్‌కు అర్పించే నిజమైన నివాళి అని వామపక్ష నేతలు అన్నారు. కమ్యూనిస్టు సిద్ధాంతకర్త ఫ్రెడరిక్ ఏంగెల్స్ స్థానిక హనుమాన్‌పేటలోని మార్క్స్, ఏంగెల్స్ జంట విగ్రహాల వద్ద శుక్రవారం ఏంగెల్స్ 127వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఏంగెల్స్, మార్క్స్ విగ్రహాలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు అక్కినేని వనజ, సీపీఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డీవీ కృష్ణ పూలమాలలు ఉంచి నివాళి అర్పించారు. అనంతరం సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో అక్కినేని వనజ మాట్లాడుతూ ఏక ధృవ ప్రపంచం అని మిడిసిపడుతున్న అమెరికన్ సామ్రాజ్యవాద దేశాల కుట్రలను, ఎత్తుగడలను ఎదురొడ్డి సోషలిజం నిలబడిరదని చెప్పారు. నేడు ప్రపంచ దేశాలు ఆర్థిక, రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని, ఈ తరుణంలో మార్క్స్, ఎంగెల్స్ సిద్ధాంతం వైపు మేధావి వర్గం చూస్తోందన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మతం పేరుతో ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తూ రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోందన్నారు. దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో ఎటువంటి పాత్ర లేనివారు నేడు దేశ భక్తులుగా చలామణి అవుతున్నారని, అన్యాయాలు, అక్రమాలను ప్రశ్నించిన దేశభక్తులను దేశద్రోహులుగా చిత్రీకరించి జైళ్లలో పెడుతున్నారని అవేదన వ్యక్తంచేశారు. డీవీ కృష్ణ మాట్లాడుతూ మార్క్స్ కమ్యూనిస్టు ప్రణాళిక, దాస్ క్యాపిటల్ వంటి సైద్ధాంతిక గ్రంథాల రచనలో ఏంగెల్స్ నిత్యం వెన్నంటి ఉన్నారని గుర్తుచేశారు. ఫాసిస్టు, పెట్టుబడిదారి దోపిడీ వ్యవస్థల నుంచి బయటపడాలంటే సోషలిజమే ప్రత్యామ్నాయమని అన్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి అమెరికా వంటి నాటో దేశాల కుట్ర కారణమని చెప్పారు. తొలుత ప్రజా నాట్యమండలి రాష్ట్ర కోశాధికారి ఆర్.పిచ్చయ్య అభ్యుదయ గేయాలు ఆలపించారు. సీపీఐ నగర సహాయ కార్యదర్శులు లంక దుర్గారావు, నక్కా వీరభద్రరావు, సీపీఐ నగర కార్యవర్గ సభ్యుడు తూనం వీరయ్య, ఇస్కఫ్ కృష్ణా జిల్లా కార్యదర్శి మోతుకూరి అరుణకుమార్, సీపీఐ నాయకులు మన్నెం సుబ్బయ్య, పరగటి భాను, హరిబాబు, సీపీఎం నాయకులు ఎన్‌సీహెచ్ శ్రీనివాస్, విద్యార్థి సమాఖ్య నగర నాయకులు రమేష్, చందు తదితరులు పాల్గొన్నారు.