విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తున్న ఫర్టిలైజర్ షాపులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక సిపిఐ కార్యాలయం నందు రైతు సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల పరిధిలోని వివిధ గ్రామాలలో ఉన్న ఫర్టిలైజర్ షాపులలో ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తూ రైతులను నట్టేట ముంచుతూ అప్పుల పాలు చేస్తున్నారని విమర్శించారు. బీరలింగేశ్వర ఫర్టిలైజర్ యాజమాన్యం ఎరువుల ధరలను విచ్చలవిడిగా వేస్తూ లక్షల్లో ఆదాయం సంపాదిస్తూ, రైతులకు మాత్రం అప్పులు మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా ధర 270 రూపాయలు ఉంటే రూ 300,రూ 310 వరకు ఇస్టానుసారంగా అమ్ముతున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తున్న ఫర్టిలైజర్ షాపులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిక్కన్న, జాఫర్ పటేల్, మహబూబ్ తదితరులు పాల్గొన్నారు.