విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఇచ్చిన గ్రామాల్లో వైసీపీ సర్పంచులు కక్ష సాధింపు తగదని టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి విమర్శించారు. సోమవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులో టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి స్వగృహం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారన్నారు. మండలంలో ప్రజలు టీడీపీకి మెజారిటీ ఇచ్చారని తెలిపారు. ఇది ఓర్వలేని వైసీపీ నేతలు టీడీపీకి మెజారిటీ ఇచ్చిన గ్రామాల్లో వైసీపీ సర్పంచులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం దారుణమన్నారు. ముఖ్యంగా మండల పరిధిలోని హనుమాపురం గ్రామంలో ప్రజలకు తాగునీరు ఇవ్వకుండా మోటారు స్టాటర్లు వారి ఇంట్లో పెట్టుకొని తాగునీటిని సరఫరా చేయడం లేదన్నారు. ఇలాంటి విషపు ఆలోచనలు మాని ప్రజలకు సేవ చేయాలని లేనిపక్షంలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ టౌన్ అధ్యక్షులు మల్లికార్జున, హనుమాపురం నాయకులు ఈరన్న, పెద్దయ్య, రాజశేఖర్, రంగన్న తదితరులు పాల్గొన్నారు.