సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ రామాంజనేయులుకు వినతిపత్రం
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని గురువారం జరిగిన గ్రామసభలో సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ రామాంజనేయులుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, సీపీఎం మండల కార్యదర్శి తిక్కన్న, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ మాట్లాడుతూ గ్రామంలో డ్రైనేజీలలో పూడిక పేలుకోపోవడంతో మురుగునీరు రోడ్లపై పారుతున్నాయన్నారు. దీంతో వర్షాలు వస్తే వర్షపు నీరు ఇళ్లలోకి వస్తున్నాయని తెలిపారు. మండల పరిషత్ కార్యాలయం పక్కన ఉన్న పొలాలకు వెళ్లే రోడ్డు గుంతల మయంగా మారిందన్నారు. రైతుల ఎడ్లబండ్లు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే రోడ్డుకు ఎర్ర మట్టి వేసి గుంతలు పూడ్చాలని కోరారు. మండల పరిధిలోని వివిధ గ్రామాలలో సమస్యలను పరిష్కరించడంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం పంచాయతీలకు నిధులు విడుదల చేసి గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. గ్రామ సభలను నిర్వహించేటప్పుడు మూడు రోజుల ముందుగానే గ్రామాలలో దండోరా వేయించాలని డిమాండ్ చేశారు.