విశాలాంధ్ర – పెద్దకడబూరు : – కూలీలు వలసలు వెళ్లకుండా ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని ద్వామా పీడీ అమర్నాథ్ రెడ్డి సూచించారు. మంగళవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక సచివాలయం – 2 నందు ఎంపీడీఓ జనార్ధన్ అధ్యక్షతన కూలీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి కూలీలు ఎవరూ కూడా ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లొద్దని మీ గ్రామంలో పని చేసుకొనుటకు పనులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఖచ్చితమైన కొలతల ప్రకారం పనులు చేస్తే రోజుకు 300 రూపాయలు ప్రకారం వేతనం పడుతుందన్నారు. ప్లాంటేషన్ కింద మునగ, దానిమ్మ వంటి చెట్లను పెంచుకోవాలని సూచించారు. 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులు పండ్ల తోటలు పెంచుకోవాలని, తద్వారా అదనపు ఆదాయం వస్తుందని తెలిపారు. చదువుకున్న నిరుద్యోగ యువతీ, యువకులకు స్కిల్ డెవలెప్మెంట్ పై శిక్షణ ఇప్పించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయం నందు ఉపాధి సిబ్బందితో సమావేశం నిర్వహించి గ్రామాలలో కూలీలు వలసలు వెళ్లకుండా ఉపాధి పనులపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేఈ ఖాదర్ భాష, సీటిఏ గిడ్డయ్య, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు పాల్గొన్నారు.