–అసంపూర్తిగా నాడు – నేడు పనులు
–ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు శరత్ కుమార్
విశాలాంధ్ర-ఆస్పరి (కర్నూలు జిల్లా) : మండల పరిధిలోనే బిల్లేకల్లు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో విద్యాశాఖ అధికారులు విఫలమయ్యారని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు శరత్ కుమార్ విమర్శించారు. గురువారం హైస్కూల్ నందు ఏఐఎస్ఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైస్కూల్ నందు మౌళిక సదుపాయాలు కరువయ్యాయన్నారు. పాఠశాలలో ఆర్.ఓ మినరల్ వాటర్ ప్లాంట్ లేకపోవడంతో విద్యార్థులు స్వయంగా ఇళ్ళ నుండి మంచినీళ్లు తెచ్చుకొని తాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన నాడు – నేడు పనులు పాఠశాలలో ప్రారంభించారని, గదుల నిర్మాణం పూర్తి కాకుండా మధ్యలోనే అసంపూర్తిగా పనులు ఆగిపోయాయన్నారు. మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఆరుబయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, పాఠశాల పక్కనే రోడ్డు ఉండడం వల్ల పహారా గోడ లేకపోవడంతో విద్యార్థులకు ప్రమాదం పొంచి ఉందని ఆయన హెచ్చరించారు. విద్యాశాఖాధికారులు స్పందించి, పాఠశాలలో విద్యార్థులకు ఆర్.ఓ మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని, పహారా గోడ నిర్మించి విద్యార్థులకు రక్షణ కల్పించాలని, అసంపూర్తిగా మధ్యలొనే ఆగిపోయిన నాడు – నేడు పనులు పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఈశ్వర్, ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి రమేష్, నాయకులు నవీన్, మహేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.