పెనుగొండ లక్ష్మీనారాయణ
అధ్యక్షులు, అరసం జాతీయసమితి
సెల్: 9440248778
ఏడు దశాబ్దాల జీవిత కాలంలో ఐదు దశాబ్దాలు ‘జీవితం ఒక ఉద్యమం’ గా వర్థిల్లిన జీవితం ఎస్వీ సత్యనారాయణది.
అభ్యుదయ రచయితల సంఘం, అభ్యుదయ సాహిత్యోద్యమ నేతగా ‘జాతీయోద్యమం నుంచి ఈనాటి దళిత ఉద్యమందాకా దాదాపు తొమ్మిది దశాబ్దాల ఉద్యమగీతాల పరిశీలన’ తో ‘తెలుగులో ఉద్యమ గీతాలు’ పరిశోధనా గ్రంథం, ‘ప్రజా పోరాటం` సాహిత్యాల పరస్పర ప్రభావాన్ని సశాస్త్రీయంగా అంచనా కడ్తూÑ తెలంగాణా సాయుధ పోరాట సాహిత్యం, దళిత స్త్రీవాద ఉద్యమాలపై విశ్లేషణ, వివరణలతో కూడిన ‘స్త్రీ వాద వివాదాలు’, ‘దళితవాద వివాదాలు’ వ్యాస సంకలనాలు, దళిత సాహిత్య నేపథ్యం, అభ్యుదయ సాహిత్యోద్యమ ప్రముఖుల జీవితాలను ఆవిష్కరిస్తూ ‘రేఖా చిత్రాలు’ మరీ ముఖ్యంగా ‘జీవితం ఒక ఉద్యమం’ కవితా సంపుటి, వామపక్ష నేతల జీవిత చరిత్రలను వెలువరించిన అభ్యుదయ సాహిత్యోద్యమ జీవి ఎస్వీ. ఎస్వీ యితర రచనలూ, సంపాదకత్వం వహించిన, సంకలనపరిచిన గ్రంథాలన్నీ అభ్యుదయ సాహిత్యోద్యమ నిధియే.
ఎస్వీ గొప్ప వక్త. ‘నీ నోటికి ధాటికి ఎవడాగును సత్తి? ఎవరైనా ఎదురొస్తే ఎరుపెక్కే కత్తి!’ అన్న అమరకవి ఎండ్లూరి సుధాకర్ కవితా పంక్తులను గుర్తుకు తెస్తున్నాను. వేదికెక్కితే, వాదనకు దిగితే ఎస్వీ నాలుక ఎంత పదునెక్కుతుందో, ఎంత హేతుబద్ధంగా, న్యాయబద్ధంగా సాగుతుందో! నిబద్ధత, నిజాయితీలతో కూడిన ఎస్వీ వాగ్దాటి గర్జనల ముందు శత్రువు నిలబడలేక బలహీనడవుతాడన్న దానికి తెలుగు నాట ఎస్వీ వినిపించిన వందల వేల ప్రసంగాలే సాక్ష్యాలు.
అక్షర, ప్రసార, ప్రచార మాధ్యమాలలో ఎస్వీది తిరుగులేని అభ్యుదయవాణి. ఎస్వీ రచనలు, ప్రసంగాల ప్రభావంతో అభ్యుదయ ఉద్యమాలతో అనుబంధమేర్పరుచుకున్న వారెందరో. కళాశాల అధ్యాపకుడి నుంచి తెలుగు విశ్వ విద్యాలయం ఉపకులపతి దాకా స్వయంకృషి , ప్రతిభతో ఎదిగిన ఉన్నత స్థాయి ఎస్వీది. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శిగా , అధ్యక్షునిగా, అరసం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన ఉత్తమ కార్యకర్త ఎస్వీ.
1973 ఆగస్ట్ 10, 11, 12 తేదీలలో గుంటూరులో జరిగిన అరసం ఆరవ రాష్ట్ర మహాసభల నుంచీ 2023 ఫిబ్రవరి 11, 12 తేదీలలో తెనాలిలో జరిగిన అరసం 19 వ రాష్ట్ర మహాసభల వరకూ అంటే వరుసగా 14 మహాసభలకు హాజరైన ప్రతినిధులు ఎస్వీ, పెనుగొండ మాత్రమే.
అరసంలో మేము చేరి నప్పుడు అరసం, విరసం మధ్య తీవ్ర విబేధాలున్నాయి. తరువాత కాలంలో వామపక్షాభిమానులు, మేధావులు ఆకాంక్షించే ఐక్య కార్యాచరణను సాధించాం. విరసం ఇతర సాహిత్య సాంస్కృతిక సంస్థల పట్ల మిత్ర వైఖరిని పాటించాం. నేటికీ అరసం ఈ విధానాన్ని కొనసాగిస్తూనే ఉంది.
అరసం ఆరవ మహాసభ సందర్భంగా అచ్చేసిన ప్రత్యేక సంచికలో ఎస్వీ ‘అగ్ని గీతం’ కవిత రాశారు. ‘పీడిత ప్రజాశక్తుల స్వేదజలం నుంచి నూతన ప్రపంచానికి, ప్రస్థానిస్తాను’ అన్నాడు. తన సాహిత్య మార్గదర్శిగా మార్క్సిజాన్ని ఎంచుకున్న ఎస్వీ ‘మూగబోయిన గుండెల్నించి మార్క్సిజాన్ని పలికిస్తాను’ అని నినదించాడు. ఐదు దశాబ్దాలుగా మార్క్సిజం మార్గంలో అక్షరాల అగ్నిని కురిపిస్తూనే ఉన్నాడు.
16 ఆగస్ట్ 1954 న హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో ఒక సాహిత్య కుటుంబంలో జన్మించిన ఎస్వీ అసామాన్య స్థాయికి జీవితంలో ఎదిగాడు. మట్టిలో నుంచి మాణిక్యాలు ఉద్భవిస్తాయనటానికి ఎస్వీ సజీవ ఉదాహరణ.
అభ్యుదయ సాహిత్యోద్యమనేత ఆవంత్స సోమసుందర్‌గారన్నట్లు ‘జీవితంG కవిత్వంR ఉద్యమం అంటే ఎస్వీ కవిత్వం, ఇంకా సాహితీ మిత్రులన్నట్లు ‘ఆవేశం రూపెత్తిన అభ్యుదయ కవిగొంతు’ నిత్యోత్సాహి, నిరంతర ఉద్యమ జీవి ఎస్వీ. ప్రియమిత్రుడు ఎస్వీకి సప్తతి సందర్భంగా అరసం పక్షాన శుభాకాంక్షలు.