ఐ.ప్రసాదరావు, 9948272919
తెలుగు సాహితీ లోకంలో బొల్లిముంత శివరామకృష్ణ ఒక నిశ్శబ్ద విప్లవం. చదువుతున్న రోజుల్లోనే విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నాడు. ఆ రోజుల్లోనే ‘‘దేశం ఏమయ్యేట్టు?, వ్యక్తి స్వాతంత్య్రం’’ వంటి కథలు రాసిన అభ్యుదయ రచయిత. ఉపాధ్యాయుడుగా గుంటూరు జిల్లా చదలవాడ పాఠశాలలో పనిచేసాడు. 16 సంవత్సరాల వయసులోనే ‘‘ఏటొడ్డు’’ అనే కథ రాయగా, చిత్రాంగి పత్రికలో ప్రచురుణ చేసినారు.1945లో ఉపాధ్యాయ వృత్తి వదిలి, వ్యవసాయ కార్మిక సంఘంలో చేరి, చల్లపల్లి రాజాకు వ్యతిరేకంగా జరుగుతున్న భూపోరాటంలో పాల్గొన్న ఉద్యమ కెరటం. ప్రజానాట్యమండలి పునరుద్ధరణలో పాలుపంచుకున్నాడు. బెంగాల్ కరువుపై బుర్రకథ రాసాడు.
పూర్తి సమయం పార్టీకి కేటాయించారు. తెలంగాణ పోరాటం విని, అవగాహన చేసుకొని ‘‘మృత్యుంజయులు’’ అనే వీరోచిత నవల రాశారు. దీనిలో అన్ని పాత్రలు వీరమరణాలు పొందినవే..1946-51 మధ్య అర్ధ దశాబ్ది కాలం, కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన తెలంగాణ సాయుధ పోరాటంలో, రైతులు పక్షాన నిలబడి దోపిడీ వర్గాల వారిపై తిరుగుబాటు బావుటా ఎగురవేశాడు. ఎర్రజెండాకు వారసుడుగా కదిలాడు ముఖ్యంగా నవలాయుధంతో కదంతొక్కాడు. పలువురు రచయితలను ఆ బాటలో నడిపాడు. కమ్యూనిస్టు కార్యకర్తగా తన అనుభవాలులోకి వచ్చిన అంశాలనే కథలుగా రాసాడు. మనుషులు మారాలి, శారద, విచిత్రబంధం వంటి సుమారు యాభై సినిమాలకు మాటలు, సంభాషణలు రాశాడు. ప్రజాశక్తి దినపత్రికలో ప్రచురితమైన ఈయన రాసిన కథ ‘‘దేశం ఏం కావాలి’’ బహుళ ప్రజాదరణ పొందింది.
ఉపాధ్యాయుడుగా, ఉద్యమ కెరటంగా, హేతువాదిగా, నవల, సినీ రచయితగా, అరసం నేతగా, కమ్యూనిస్టు కార్యకర్తగా, ప్రతిభ, ప్రజాపక్షం సంపాదకుడుగా విభిన్నరకాల సేవలు అందిస్తూ జూన్ 7, 2005లో మరణించిన బొల్లిముంత తెలుగు అభ్యుదయ సాహిత్యంలో మృత్యుంజేయుడుగా నిలిచాడు. సామాన్య ప్రజలు, రైతులు, వ్యవసాయ కూలీల పక్షాన నిలిచాడు. ఈయన స్ఫూÛర్తితో నేడు దేశ రాజధాని ఢల్లీిలో సంవత్సర కాలంగా నల్లచట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటానికి, అభ్యుదయ భావాలు కలవారు అందరూ బాసటగా నిలవడమే బొల్లిముంత శివరామకృష్ణకు మనం ఇచ్చే ఘన నివాళి.
(7-11-21న బొల్లిముంత శివరామకృష్ణ జయంతి)