ఏది స్వాతంత్రం స్త్రీ జాతికి నేడు
భారతాన స్వేచ్ఛ ఏది స్త్రీ మూర్తికి
పశుత్వం బుసలు కొట్టి నారీలోకాన్ని
విష వాంఛల వికృత క్రీడలలో
నలుగుతున్న స్త్రీ మూర్తికి
ఇదే ఇదే నవోదయపు భారతమందామా..??
కర్మభూమిలో రాలిన పువ్వులు ఎన్నెన్నో
గడప గడపకి చెరగని గుర్తులు ఎన్నెన్నో
స్త్రీ మూర్తిని దైవంగా కొలిచే ఈ దేశంలో
చంపబడ్డ స్త్రీమూర్తుల కంకాళా లెన్నెన్నో
ఇదే ఇదే నవోదయపు భారతమందామా??
ధర్మభూమి వేదభూమి జ్ఞానభూమియంటారు
స్త్రీ శక్తిని పూజించే సంస్కారం మాదంటారు
మరి అన్ని ఉన్న దేశంలో ఈ మారణ హోమాలు
స్త్రీ హత్యాచారాలకు దేశమంతా నిలయాలు
ఇదే ఇదే నవోదయపు భారతమందామా..??
కులంపేర మతంపేర న్యాయాన్ని అడుగుతారు
అడుగడుగున రాజ్యాంగాన్ని కూలదోస్తారు
దిశా నిర్భయ సమతా ఎన్ని చట్టాలొచ్చినా
ఈ కామాంధుల వాంఛలను ఆపగలిగేనా
ఇదే ఇదే నవోదయపు భారతమందామా..??
స్త్రీలంతా ఏకమై మున్ముందుకు సాగాలి
ఈ అత్యాచారాలకు అడ్డుకట్ట వేయాలి
మహిళల చైతన్యమే మానవ ప్రగతికి మూలం
మన మహిళలను గౌరవిస్తేనే ఆ ప్రగతి సాధ్యం
అదే అదే నవోదయపు భారతం
అదే అదే నవోదయపు భారతం
మెట్టపల్లి మహేంద్ర