చతుర్విధ దశల జీవన రూపకంలో
వృద్ధాప్యం ఆఖరి ప్రకరణం
బాల్యం, కౌమారం, యవ్వనాలు
ఇష్టంగా ఇట్టే గడిచిపోయే మనిషికి
జీవితపు మలిసంజె మాత్రం
అయిష్టంగా, భారంగా
భయం భయంగా
దిగులు దిగులుగా గడుస్తుంది!
వృద్ధాప్యం అసహజమేమీ కాదు..
ప్రతివ్యక్తీ తప్పనిసరిగా చేరుకునే
జీవితపు చివరి మజిలీ!
వార్ధక్యం శేష జీవితం కాదు..
అశేష అనుభూతుల నిధి!
వృద్ధుడు నిరర్థక వ్యక్తి కాదు..
కుటుంబానికి మార్గదర్శిjైున పెద్దదిక్కు!
వృద్ధుడు ఆషామాషీ మనిషి కాదు..
అవస్థలన్నింటినీ అనుభవించి
కాచివడబోసిన అనుభవాలసారాన్ని
భావితరాలకు అందించే
వారసత్వ విలువల ప్రదాత!
అయితే..
ఎందరికో దారిచూపిన పెద్దరికానికి
నేడు అడుగడుగునా భయాల గాయాలే..!
క్షణక్షణం తెలియని ఆందోళనలే..!
వేధించే శారీరక రుగ్మతలు, వెంటాడే మానసికాందోళనలు
అయినవాళ్ళ నిరాదరణలు, ఈసడిరపులు
ముదిమి బతుకులకు శాపాలై
నలుగుతూ మూలుగుతుంది వృద్ధాప్యం..!
సుదీర్ఘ జీవనయానంలో
బరువు బాధ్యతలు మోసీ మోసీ
కడగండ్ల సంద్రాన్ని ఈదీ ఈదీ
మనసూ దేహమూ అలసిసొలసి
కాలాన్ని భారంగా కొలుస్తూ
మలి సంధ్యా సమయానకుంగిపోతున్న పండుటాకులు
కోలుకొని కుదుటపడటానికి బిడ్డలుకావాలి ఊతకర్రలు
అందించాలి ఆత్మీయతానురాగాలు!
తల్లిదండ్రుల సంరక్షణ బరువుగా కాకుండా
బాధ్యతగా, విధిగా భావించి అందించే
పిల్లల ఆలంబన, సాంత్వనలే
వివర్ణమౌతున్న వృద్ధాప్యపు కాంతిరేఖలకు
ఉద్దీపనాలై సరికొత్త వెలుతురునందిస్తాయి!
వృద్దాప్యం శాపం కాదు
ఈ చరాచర జగత్తులో
సకల జీవరాశులూ అనుభవించే
సృష్టిధర్మమని అందరూ గ్రహించాలి..!
పి.వి.ప్రసాద్, 9440176824