డా॥ కె.బి. గోపాలం, సెల్: 98490 62055
ఆ మధ్యన నేను ఒక సైంటిస్టుల సమావేశానికి వెళ్లాను. స్వాతంత్రం తరువాత భారతదేశానికి సైన్సులో నోబెల్ బహుమానం రాలేదని ఒక పెద్దమనిషి అక్కడ ఏదో కొంపలు మునిగినట్టు ఫిర్యాదు చేశాడు. ఇంచుమించు సభ చివరలో నాకు కూడా మాట్లాడడానికి అవకాశం వచ్చింది. సైన్సులో నోబెల్ బహుమానం రాలేదు సరే, మరి సాహిత్యంలో కూడా రాలేదు. అంటే ఆ బహుమానంలో ఎక్కడో ఏదో తేడా ఉంది అన్నాను నేను.
జపాన్ వారికి కూడా సాహిత్యంలో నోబెల్ బహుమతులు రాలేదు. ఎప్పుడో చాలా కాలం క్రితం యసునారి కవబాటా అనే రచయితకు బహుమతి వచ్చింది. ఆ తరువాత కొంతకాలానికి కెంజబూరో ఓయె అనే రచయితకు నోబెల్ వచ్చింది. మళ్లీ ఇటీవల ఇషిగురో కాజువో అనే రచయితకు కూడా సాహిత్యంలో నోబెల్ దక్కింది. మొత్తానికి వారికి మూడు బహుమతులు వచ్చాయి. మన దేశానికి ఒక్కటి కూడా రాలేదు. కెంజబూరో ఓయే అనే రచయిత గురించి, ఆయన రచనలను గురించి చదవడానికి అవకాశం దొరికింది. ఆయన రచనలు చాలా మటుకు ఇంగ్లీషులోకి వచ్చాయి కూడా. కనుకనే నాకు వాటిని చదవడానికి అవకాశం దొరికింది. ఆయన రాసిన ఒక నవల పేరు తెలుగులో చెబితే మొగ్గలను తుంచెయ్యండి, పిల్లలను షూట్ చేయండి, అంటే చంపేయండి అని అర్థం వస్తుంది. నోబెల్ స్థాయి రచనలు చేసిన ఒక రచయితలో ఇంతటి చేదు తనం ఉందంటే నాకు ఆశ్చర్యంతో పాటు అదురు లాంటి భావాలు కూడా కలిగాయి.
ఈ రచయిత పేరులోని రెండవ అక్షరాన్ని జెడ్ శబ్దంతో పలకాలి. మూడవ అక్షరాన్ని ఇంచుమించు యా వత్తు ఇచ్చినట్టు పలకాలి. ఓయే అనే పేరును పలకడంలో ఒక విచిత్రమైన మలుపు ఉంది. మొత్తానికి ఈ రచయిత ప్రత్యేకమైన వ్యక్తి. ఆయనకు ఒక కొడుకు ఉన్నాడు. ఆ అబ్బాయి మనోవైకల్యం కలవాడు. కనుకనే ఆ తండ్రి మనసులో అంత చేదుతనం నిలిచింది. హెన్రీ కిసింజర్ అనే అమెరికన్ దౌత్యవేత్త ఈ రచయిత నవ్వు, దయ్యం నవ్వులాగ ఉంటుంది అన్నాడు. అయితే వీళ్ల ఇద్దరి ఆలోచనలలో ఎక్కడా కొంచెం కూడా పొంతన లేకపోవడం బహుశా ఈ వ్యాఖ్యానానికి కారణం అయి ఉంటుంది, అని నా అనుమానం. రచయిత మాత్రం తన గురించి, తన దేశం గురించి, చాలా విచిత్రంగా వ్యాఖ్యానించాడు.
నల్లని వర్షం అని పేరు వచ్చే ఒక జపనీస్ నవల అనువాదాన్ని నేను కొన్ని దశాబ్దాల కింద కొన్నాను. రచయిత పేరు మసూజీ ఇబూసే. అయితే ఇంతకాలంగా నేను ఆ నవలను చదవడానికి ప్రయత్నించలేదు. అందుకు కారణం ఏమిటో నాకు చెప్పడానికి రావడం లేదు. మధ్యలో జపాన్ సాహిత్యం చాలా చదివాను. ఈ మధ్యన మళ్లీ బ్లాక్ రెయిన్ పుస్తకాన్ని చేతికి తీసుకున్నాను. సగం చదివిన తరువాత, మళ్లీ దాన్ని లోపల పెట్టేశాను. నేను చాలా కాలంగా పుస్తకం చదవక పోవడానికి కారణం నాకు ఇప్పుడు అర్థం అయింది. జపాన్ జన జీవితంలో చాలా చేదు అనుభవాలు ఉన్నాయి. హీరోషిమా అందులో అన్నిటికన్నా ముఖ్యమైనది. ఓయే రచనలలో కూడా అప్పటి అనుభవం ప్రధానాంశంగా ఉంటుంది. బ్లాక్ రెయిన్ అన్నది అచ్చంగా హీరోషిమాకు సంబంధించిన కథ మాత్రమే. ఆ అంశాలను చెప్పడానికి రచయిత ఎంచుకున్న పద్ధతి ఆశ్చర్యకరంగా ఉంది. కానీ అప్పుడు జరిగిన ఘోరాలను గురించి చదువుతూ పోవాలంటే, మనిషికి చాలా ఓపిక ఉండాలి. ఒక రకమైన క్షమా భావన ఉండాలి. బోలెడంత సానుభూతి ఉండాలి.
ఓయే ఒకవైపు అణుబాంబు బాధితులను, మరొకవైపు తన కొడుకు లాంటి దురద ృష్టవంతులను మాత్రమే అంశాలుగా తీసుకుని రచనను సాగించాడు. అయినా ఒక రచయిత జీవితం సర్కస్‌లో బఫూన్ లాంటివాడు, అనగలిగాడు అతను. అయితే ఆ క్లౌన్ అనే బఫూన్ దుఃఖం గురించి కూడా మాట్లాడతాడు అన్నాడు. తన మొత్తం రచనలలోనూ తన కొడుకు వంటి పిల్లల పరిస్థితి, పల్లె బతుకు, పట్నం తీరు మధ్య గల వైరుధ్యాలు మాత్రమే ఉంటాయి అని అతన్ని గట్టిగా చెప్పాడు. ఓయే 1935లో పుట్టాడు. ఇంకా లక్షణంగా బతికే ఉన్నాడు. నోబెల్ బహుమానం ఈ సందర్భంగా ఆయన చేసిన ఉపన్యాసం అంతకు ముందటి నోబెల్ గ్రహీత కవాబాటా మాటలను ముందుకు సాగినట్లు ఉంటుంది. కవాబాటా అందమైన జపాను, అందులో నేను అని తన ఉపన్యాసానికి శీర్షిక పెట్టుకున్నాడు. ఇతను మాత్రం అందం గురించి ప్రస్తావన చేయకుండా ఆంబిగువస్ అన్న విశేషణాన్ని తన దేశానికి తగిలించాడు. ఆ మాటకు అస్థిరమైన తీరు గలది, లేదా ఒకటి కన్నా ఎక్కువ రకాలుగా నిర్వచించి చెప్పగలిగినది అని అర్థం వస్తుంది. రచయిత తన దేశం గురించి ఇంత ముక్కుసూటిగా చెప్పగలిగితే ఇక రచనలు ఎంత గొప్పగా, ఎంత వాస్తవికంగా చేయగలడు అన్నది మనం సులభంగా ఊహించుకోవచ్చు. 1994 లో తను నోబెల్ బహుమానం అంగీకరించాడు. కానీ తన సొంత దేశంలో ప్రభుత్వం వారు ఇవ్వదలచిన అన్నిటికన్నా గొప్ప బహుమతి ఆర్డర్ ఆఫ్ కల్చర్‌ను మాత్రం అతను నిరాకరించాడు. దేశంలో ప్రభువును పరమాత్ముడుగా భావించే పద్ధతి ఉన్నందుకు తాను బహుమతిని తీసుకోవడం లేదు అని బాహాటంగా చెప్పాడు.
పెళ్లి తర్వాత మూడు సంవత్సరాలకు ఈ రచయితకు ఒక కొడుకు పుట్టాడు. అతనికి హికారి అని పేరు పెట్టారు. ఈ పేరు నేను పలికినప్పుడు డిక్టేషన్ తీసుకుంటున్న నా కంప్యూటర్ వికారి అని టైప్ చేసింది. బహుశా కంప్యూటర్‌కు అబ్బాయి గురించి తెలిసినట్లు ఉంది. అతను తీవ్రమైన వైకల్యం గల పిల్లవాడు. నిజానికి అతని పేరుకు అర్థం కాంతి అని. తల్లిదండ్రుల బతుకుల్లో వెలుగు నింపాల్సిన ఆ పిల్లవాడు వారికి పెద్ద సమస్యగా ఎదురయ్యాడు. ఆరు సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మాత్రమే ఒక పూర్తి వాక్యం మాట్లాడగలడు. అయితే ఆ తర్వాత మాత్రం సంగీత రంగంలో గొప్ప సంచలనాలను సృష్టించగలిగాడు.
రచయిత ఓయే ఇంగ్లీష్ భాష మీద మంచి పట్టు గల వ్యక్తి. అతను ఒక ఉపన్యాసంలో సాహిత్యం ద్వారా తన దేశాన్ని పరిచయం చేస్తాను అంటూ మొట్టమొదట షికిబు మురసాకీ గురించి చెప్పాడు. ఈమె ఒక స్త్రీ. పదవ దశాబ్దంలోనే ఆమె జపాన్ రాజకుటుంబాలను గురించి వెయ్యి పేజీల పైన ఉండే ఒక నవల రాసింది. ఆ నవల ఇవాళటికీ జపాన్ దేశంలో ఎంతో విస్త ృత ప్రచారం, గౌరవం గల రచన. ఇంతకూ ఆ రచయిత్రి రాజమహల్లో పనిచేసే ఒక మామూలు మనిషి. కథానాయకుని పేరు గెంజి. అతనికి ఒక కొడుకు పుట్టాడు. ఆ పిల్లవాడు పెద్దవాళ్ళు అయిన తరువాత చదువు కోసం పంపించవలసిన వస్తుంది. రాజమాత అందుకు అభ్యంతరం చెబుతుంది. పిల్లవాని వలన చాలా సమస్యలు వస్తాయి. కథ బలంగా ముందుకు సాగుతుంది. ఈ పుస్తకము ఈనాటికీ అందరికీ దొరుకుతున్నది. మా వద్ద ఉంది కానీ నేను దాన్ని ఇంకా చదవలేదు.
ఓయే ప్రస్తావించిన మరొక రచయిత పేరు సోసెకీ నాత్సుమే. ఈయన రచనలు కొన్ని నేను చదివాను. వాటిని చదివినందుకు ఒక నవల చదివిన భావన కాక, నాకు మనస్తత్వ శాస్త్రం గురించి తెలుసుకున్న అనుభవం లాంటిది కలిగింది. ముఖ్యంగా కోకొరో అనే నవల చాలా విచిత్రంగా ఉంటుంది. అందులోని ఒక పాత్ర, పుస్తకం మొత్తంలోనూ గురువుగారు అన్న పేరుతోనే గుర్తింపబడుతుంది. అదే పుస్తకంలో ప్రధాన పాత్ర. ఆ వ్యక్తి మనస్తత్వం గురించి తెలుసుకున్న తరువాత కొంతకాలం నాకు నిద్ర పట్టలేదు.
కెంజబూరో జపనీస్ సాహిత్యం ద్వారా జపాన్ గురించి చెప్పడానికి ఉదాహరణగా తీసుకున్న మూడవ వ్యక్తి తానే. అయితే చాలా వినయంగా తాను మొదట చెప్పిన ఇద్దరు రచయితలతో సమానమైన హోదా కలవాడిని కాను అని ముందే చెబుతాడు. ఓయే మాటలు చదివిన తరువాత మొత్తానికి నాకు జపాన్ రచయితల పట్ల, వారి సాహిత్యం పట్ల ఎంతో ఆసక్తి మొదలైంది. ఎన్నో రచనలు సంపాదించాను. పాతకాలం పుస్తకాలతో మొదలుపెట్టి సమకాలీన సాహిత్యాన్ని కూడా చాలా చదివాను. అన్నింటిలోనూ నాకు అసాధారణమైన ఒక ధోరణి కనిపించింది. ఆ దేశం మన దేశం వంటిది కాదు. పడమటి దేశాల వంటిది అంతకన్నా కాదు. అక్కడి జీవితం చాలా విచిత్రంగా ఉంటుంది. కనుకనే అక్కడి రచనలు, సినిమాలు కూడా విచిత్రంగా ఉంటాయి. లోకాభిరామంలో నేను మాదదయో లాంటి సినిమాలను గురించి రాశాను. నిజానికి జపాన్ సాహిత్యం గురించి మరింత తెలుసుకుని, మరింత లోతుగా పరిశీలించి వివరంగా రాయాలన్న కోరిక మనసులో లోతున పాతుకుని ఉన్నది.