సన్నిధానం నరసింహశర్మ, సెల్: 9292055531
ఒక నానుడి ఏర్పడడానికి ఏళ్లూ పూళ్లూ పడుతుందా. ‘దేశమైనా చూడు కోశమైనా చూడు’ అనేది ఒక నానుడి. లేదా ఒక సామెత. దేశ మంతా చూస్తే ఎంత జ్ఞానం కలుగుతుందో కోశం అంటే నిఘంటువును తరచితే అంత జ్ఞాన విస్తృతి కలుగుతుందనేది దాని సారాంశ భావం.
తెలుగు భాషలో పద్య నిఘంటువులున్నాయి. వచనంలో అకారాది క్రమానుగతమైన నిఘంటువులున్నాయి. సి.పి.బ్రౌను నిఘంటు నిర్మాణంలో పండిత గ్రంథాల శబ్దాలే కాకుండా మంది బాస పలుకులూ చోటు చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ నన్నయ, తిక్కన వంటి మహా కవుల పద ప్రయోగ కోశాల్ని ప్రకటించింది. పారిభాషిక పద కోశాలు, వృత్తి పదకోశాలు వచ్చాయి. నార్ల వారి పదబంధ పారిజాతం వంటివీ వచ్చాయి. అచ్ఛాంధ్ర నిఘంటువులూ వచ్చాయి. పత్రికారంగ సుప్రసిద్ధులు ఆర్.వి.రామారావు పత్రికా రచయితలకు నిత్యమూ వినియోగ పడే ‘తప్పులు దిద్దుకుందాం’ ను ప్రకటించారు. ఆంధ్ర సాహిత్య పరిషత్తు, కాకినాడ వారు పండిత మండలి సమన్వయ కృషితో సూర్యరాయాంధ్ర నిఘంటువు సంపుటాలను ప్రకటించింది. ఆంధ్ర వాచస్పత్యం వంటివి వచ్చాయి. తరువాత తరువాత మరికొన్ని నిఘంటువులు ఉన్నాయి. అమరకోశాన్ని అకారాధ్యమర నిఘంటువుగా కొత్తపల్లి సుందరరామయ్య కూర్చారు. వలిమెల భాస్కరం కృషికాంతిగా తెలంగాణ పదకోశం వచ్చింది.
కవిగారు, మారేపల్లి రామచంద్రశాస్త్రి ‘నుడి కడలి’ నిర్మాణం, ప్రకటనల వంటి అంశాలు కొన్ని అసూర్యంపశ్యలుగా ఉన్నాయి. జవాబులకు నోచుకోని ప్రశ్నలూ వున్నాయి. ఏ నిఘంటువు ప్రాధాన్యం దానికుంటూనే ఉంటుంది. దేని ప్రయోజనం దానిదే. శంకర నారాయణ నిఘంటువు వంటివీ వచ్చాయి. చెన్నపట్నంలోని బోధనాభ్యసన పాఠశాలకు చెందిన ఆంధ్ర పండితుడు బహుజనపల్లి సీతారామాచార్యులు రూపొందించిన శబ్ద రత్నాకరం ప్రాచుర్యం పొందిన నిఘంటువుల్లో ఒకటి.
1937లో వెలుగుచూసిన శబ్ద రత్నాకరం అనంతరానంతర నిఘంటు సముద్రాలకు నదీ ప్రవాహాలుగా సమ్మిళితమైంది. ఆ నిఘంటువు ప్రధాన ఆధారంగా ఇప్పుడు అంత్యానుపాస నిఘంటువు ఆవిర్భవించింది. యాభై వేల పదాలే సేకరించవచ్చు అనే ధీమాను ఈ నిఘంటువు సంకలనకర్త నేపథ్యంరచనలో వివరించారు. తెలుగులో ఒక బృహన్నిఘంటు నిర్మాణానికి రామోజీసంస్థవారు పండిత మండలుల చేత బృహత్తరకృషి చేశారు.
డా॥అరిపిరాల నారాయణరావు, సాహితీ సేవలకు అనేక క్రియాత్మక ఉదాహరణ లున్నాయి. గౌతమీ ప్రాంతీయ గ్రంథాలయంలో గల వేలకొలది పుస్తకాలకు డిజటలైజేషను చేయించడంలో ఏకోన్ముఖ నిస్వార్థ కృషి ఒక ఉదాహరణ. 1862 లో అచ్చయిన తెలుగు తొలి వ్యాససంపుటిని పట్టుదలతో పునర్ముద్రింప జేయడం, నరసాపురంలో తెలుగు వెలుగు మహాసభలు, సదస్సులు ప్రయోజనాత్మకంగా నిర్వహించడం, పందిరి మల్లికార్జునరావు స్మారక సాహిత్య సదస్సు నిర్వహించడం. కొన్ని జాతీయ సదస్సుల నిర్వహణ మైసూరు సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ వారి కార్యక్రమాల నిర్వహణ, వంటివి డా.అరిపిరాలను గుర్తుచేసే సాహితీ సేవలు. చెన్నపురిలో ఓ అంతర్జాతీయ సాహితీ నిఘంటు నిర్మాణ సాహితీ సదస్సులో తెలుగులో అంత్యాను ప్రాస నిఘంటు నిర్మాణ అవసరంపై పత్ర సమర్పణ చేశారు. చేసి వూరుకోకుండా తానే ఆ పెద్ద నిఘంటు నిర్మాణ యజ్ఞాన్ని తలపెట్టి అయిదు సంవత్సరాల అధ్యయనం, సేకరణ, అమరికలు కూర్పులు చేర్పులు మార్పులు చేసుకుంటూ ఇదిగో ఈ 695 పుటల అంత్యాను ప్రాస నిఘంటువును తెలుగు జాతికి అందించడం అభినందనీయం. తాను సంకలనం చేసిన తన నిఘంటువును వ్యయ ప్రయాసల కోర్చి తానే ముద్రించుకొని ప్రకటించారు.
ఈ గ్రంథంలోని అందరి ముందు మాటల్లో అభినందన శుభాకాంక్షలు చోటు చేసుకున్నాయి. నిఘంటువు గురించి నిఘంటుకర్తయినా తన సేకరణా నేపథ్య భూమికల్ని మరింతగా తెలుపుడు చేయించి ఉంటే బాగుండేది. పరిపాలనా విభాగ పదకోశాల వంటివి వచ్చినప్పటికీ తెలంగాణ భాషా పదాల, యాస బాసల నిఘంటువులు రావలసిన ఆవశ్యకత ఉంది.
ఆంగ్లంలో 50 వేల పదాల ‘ఆక్స్‌ఫర్డ్ రైమింగ్ డిక్షనరీ’ వచ్చింది. తెలుగులో ‘నారాయణీయం’ గా 50 వేల పదాలతో అంత్యానుప్రాస నిఘంటువు రావడం ఆషామాషీ అంశం కాదు. పండితుల సంపాదక మండలితో ఏ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలోనో జరుగవలసిన పని. ఈ పదాల గనిపని ఏక వ్యక్తిగా ఏకశక్తిగా చేయడం. అందునా ఈ కాలంలో చేయడం ఎద మెచ్చుకోలుకు అర్హమైనదే.
విద్యార్థి కల్పతరువు కర్త, అచ్ఛాంధ్ర నిఘంటు కర్త ముసునూరి వేంకటశాస్త్రి గ్రంథానికి ఆస్థానకవి, ద్వి శతాధిక గ్రంథకర్త శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి తాను రాసిన ఓ పీఠికలో ‘‘ఆంధ్ర మహాభారతము వంటి మరో గ్రంథమునైన రాయవచ్చును గానీ పత్తిపని వంటి కష్టసాధ్యమైన నిఘంటు నిర్మాణము చేయుట కష్ట సాధ్యము’’ అనే భావాన్ని ప్రకటించరు. ప్రపంచ ప్రసిద్ద మహా గ్రంథాలయం వాషింగ్‌టన్‌లో నేషనల్ కాంగ్రెస్ లైబ్రరీ అనే పేరున ఉంది. ఆ పుస్తకాల కేటలాగు కార్డులలో ‘రీడర్ షిప్’ అనే దానిని ఎదురుగా ఎవరికి పధనీయమో ముందుగా ఎరుకపరుస్తారు. ఈ అంత్యాను ప్రాస నిఘంటువు శాస్త్రనిధి, పండితుల విశ్వనాధ గోపాలకృష్ణశాస్త్రి తన శుభాకాంక్షలలో తెలిపారు. ‘‘ఈ గ్రంథం సాహితీలోకానికి ఎంతో మేలు చేకూరుస్తుంది. అందంగా పద ప్రయోగం చేయడంలో గేయ రచనలు, కవిత్వం, వ్యాస రచన మొదలైన రచనా వ్యాసాంగానికి మంచి తోడ్పాటు ఈ గ్రంథం వల్ల లభిస్తుంది.’’ అన్నారు ఇది అక్షరాక్షర సత్య ప్రకటన.
ఇది ఒక పద శోధనా పరిశోధనా గ్రంథం. ఆరుద్ర ఎప్పుడో చెప్పారు. ఏమంటే పరిశోధనలకు ఎప్పుడూ కామాలే తప్ప ఫుల్‌స్టాప్‌లు ఉండవని. ఈ అంత్యానుప్రాస నిఘంటుకర్తే మరికొన్ని వేల పదాలు ఇందులో చేర్చే అవకాశముందని చెప్పారు గనుక పరివర్ధిత ప్రచురణల్లో ఆ కృషిని వీరు కొనసాగించాలని ఆశిద్దాం. ఈ నిఘంటు నిర్మాణాత్మక కార్యక్రమాన్ని చేబట్టడంలో సులువు బరువులనేకం. పదాల ఏతాము నెత్తి స్వేదబిందు జలాన్ని భాషా వ్యవసాయానికి అందించడం ఓ నిరంతర ప్రవాహ ప్రక్రియ. పదాలకి అర్థాలివ్వడంలో తేలికగా అర్థమయ్యే అర్థాల పదాలను అన్వేషించుకోవడం, పదాల రూపాల ఆరోపాలు ఏ విధంగా ఇస్తే ప్రయోగార్హత పొందుతుంది. కవి ప్రయోగాలకు గ్రాంథిక భాష వాడుక భాషా పదాలు ఏవిధంగా ఇస్తే ఔపయోగికంగా ఉంటుంది. ఇన్ని అంశాల ఆలోచనల ఫలాల సమాహారం ఈ నిఘంటు రూపకల్పన.
అరడజను కొరతలను పట్టుకోవడంకాదు, ఆరు డజన్ల మేలిములుంటే వాటిని ప్రధానంగా పట్టుకోవాలి అనే బంగోరె వాక్యాలెప్పుడూ బంగారు వాక్యాలే.
ఇది శ్రమైక సాధ్య సంకలన ఫలం. ఇది తెలుగులో తొలి పంక్తిలో నిల్చిన అంత్యానుప్రాస నిఘంటువు.
అంత్యాను ప్రాస నిఘంటువు,
సంకలనకర్త: అరిపిరాల నారాయణరావు,
1/8 డెమ్మీ, 695 పుటలు, వెల: రూ.900/, ప్రతులకు: డాక్టర్ అరిపిరాల నారాయణరావు, 23
1635, లలితానగర్, రాజమహేంద్రి
533105,
ఫోను: 0989712849.