ఎస్.ఆర్. పృథ్వి, 9989223245
అంతులేని జగద్రుచులు
తృప్తిలేని రుచిరార్జనాపరుడు
ఆరుద్రుడే చూడు సప్త జిహ్వుడు నేడు
సప్త వర్ణార్ణవం మధ్య నిత్యం
ఆస్వాదించే రసనల గుచ్ఛం
పచ్చని మంటల్లా పైకి లేచిన సప్తవర్ణి
ఏక జిహ్వాగ వచ్చి, ఏడు పాయలుగ విచ్చి,
కడలి రంగులు మెచ్చు గంగ గోదావరి!
నింగి నీలిమ పీల్చు తరువు కాదా మరి! - అన్నారు ప్రముఖ కవి కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ. అది 1994 ఆగస్టు 31 ఆరుద్ర 70 వ జన్మదినం. రాజమండ్రిలో ఆ ఉత్సవం వినూతన రీతిలో నభూతో నభవిష్యత్ అన్న రీతిలో ఏర్పాటుచేశారు. ఉదయం ఆరుద్ర సమక్షంలో కవి సమ్మేళనం. ఆ సందర్భంలో కొత్తపల్లి ఆలపించిన కవిత. అంతులేని జగద్రుచులు ఎరిగినవాడు ఆరుద్ర. సందర్భం సప్తతి గనుక సప్తవర్ణాల నడుమ నిత్యం ఆస్వాదించే రసనల గుచ్ఛం ఆరుద్ర అన్నారు కవి.
గోదావరి తీరంలో, అందునా రాజమహేంద్రిలో... అదొక అద్భుతమైన సంబరం. 1994 ఆగస్టు 16 మొదలుకొని, 31 వరకు సరస్వతీదేవి వీణానాదంతో పులకింపచేసిన తరుణం. ఆరుద్రకి ఎన్నో సన్మానాలు జరిగాయి. కాని, ఆరుద్రను మురిపించి, మెప్పించి, హృదయానికి హత్తుకున్న సాహిత్య సమ్మోహిత సంబర మిది. ఆ సాయంత్రం సభలో పులకితాంకితుడై ఆరుద్ర`
నవ్య సాహిత్యాంధ్రి
నవరసాల పురంధ్రి
కొలువు రాజమహేంద్రి
ఓ కూనలమ్మా!
కొలువులో కోవిదులు
గొప్ప ప్రజ్ఞానిధులు
నన్ను మెచ్చిరి బుధులు
ఓ కూనలమ్మా!
మొదట జల్లించారు
పిదప వల్లించారు
నన్ను దీవించారు
ఓ కూనలమ్మా!
ఎంత సుదినము నేడు
ఎంత ధన్యుడు వీడు
గ్రుంకుడిక సూరీడు
ఓ కూనలమ్మా!
సాహిత్య సినీరంగాలను రెండు నేత్రాల నిండా నింపుకొన్న ఆరుద్ర గురించి ఏమి చెప్పినా, ఎంత చెప్పినా తక్కువనే అవుతుంది. ఆరుద్ర అంటే అక్షర నిధి. సాహిత్య వ్యాపకమంతా పరిశోధనల తోడి పరవళ్లు తొక్కింది. బహుముఖాలుగా విస్తరించింది. ఒక సందర్భంలో పూర్వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆవుల సాంబశివరావు, ఆరుద్రలోని పరిశీలన, పరిశోధనాతత్త్వం నిరంతర అధ్యయనంతో కలిపి ఆయన్ని పరిశోధకుడుగా తీర్చిదిద్దింది అన్నారు. అంతేకాదు, నేను మార్క్సిస్టుని. మార్క్సిస్టు కోణం నుంచే పరిశీలిస్తాను అన్న ఆరుద్ర మాటల్ని గుర్తుచేశారు. వ్యక్తిగత విశ్వాసాలు ఎలాగున్నా, పరిశోధకుడుగా ఆరుద్ర సమగ్రమైన సత్యాన్నే అన్వేషిస్తారు. పరిశోధన ఆరుద్ర ప్రవృత్తి అన్నారు.
ఆరుద్రలో` సాహిత్యం,తత్త్వం,నాట్యం,చరిత్ర పరి శోధన, చదరంగం, ఇంద్రజాలంవంటి రంగాలు విస్తరించి ఉన్నాయి. జీవించాయి కూడా. ఒక్కో రంగాన్ని ఒడుపుగా పట్టుకుని, జీర్ణించుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఆరుద్ర.
ఆరుద్ర అసలు పేరు భాగవతుల సదా శివశంకర శాస్త్రి. 1925 ఆగస్టు 31 వ తేదీన విశాఖ పట్నంలో జన్మించారు. తెలంగాణ రజాకార్ల ఉద్యమ నేపథ్యాన్ని కేంద్రంగా తీసుకుని రాసిన కవిత్వాన్ని ‘త్వమేవాహం’ సంపుటిగా వెలువరించారు. సోమసుందర్, రాంషాలు నడిపిన ‘కళాకేళి’ సంస్థ ప్రచురించింది. ఆరుద్ర సాహిత్య జీవితం ఐదు దశాబ్దాలు నిరాఘాటంగా సాగిపోయింది. విశ్వరూపాన్ని ప్రదర్శించారు. సినీవాలి, వేమన్న వేదం, ఇంటింటి పద్యాలు, వెన్నెల వేసవి, జైలు గీతాలు, అనేక నాటికలు, ఉపన్యాసాలు, నవలలు, కూనలమ్మ పదాలు వంటివెన్నో రచించారు. సమగ్రాంధ్ర సాహిత్యాన్ని తెలుగు జాతికి కానుక చేసిన మహాకవి ఆరుద్ర.
1949 సంవత్సరంలో బీదలపాట్లు అనుకుంటాను, చిత్రం ద్వారా పాటల రచయితగా చిత్ర రంగంలో ప్రవేశించారు. అక్షర మాధుర్యాన్ని గీతాలుగా మలిచి, శభాష్ అనిపించు కున్నారు. బుద్ధి మంతుడు, అన్నపూర్ణ, పవిత్ర బంధం, గూఢచారి 116, లక్ష్మీ నివాసం వంటి నాలుగు వేల చిత్రాలకు రసవత్తరమైన పాటలు అందించారు.
ఆరుద్ర కవిత్వంలో ఆవేశంకంటే, ఆలోచనకి ప్రాముఖ్యత ఉంటుం దంటారు. కొండగాలి తిరిగింది, శ్రీరామనామాలు శతకోటి, వేదంలా ఘోషించే గోదావరి, ఎదగడానికి కెందుకురా తొందర, ముత్యమంత పసుపు ముఖమెంత ఛాయ వంటి మధురగీతాలే అందుకు ఉదాహరణ.
ఆరుద్రకి రోణంకి, శ్రీశ్రీ, నారాయణబాబు, చా.సో ల సహచర్యం ఉన్న కారణగా నేరుగా ఆధునిక కవిత్వ తీరంలో విహరించారని సోమసుందర్ అంటారు. టి.ఎస్.ఎలియట్, ఆడెన్, జేమ్స్ బోయిస్ వంటి వారిని వినూతన సంవిధానం కోసం ఆరుద్ర చదివారని సోమసుందర్ అభిప్రాయం. సంగీత, నృత్య, ఛందోశాస్త్రాలు, సమగ్రాంధ్ర సాహిత్యసారం, జీలకర్ర రసంలా ఆరుద్ర సేవిస్తున్నాడని వేగుంట మోహన ప్రసాద్ అంటారు. అంతేకాదు ఒక అభిప్రాయాన్ని కూడా ఇలా వెలిబుచ్చారు. ‘‘శ్రీశ్రీ, ఆరుద్రలు జీవించిన కాలంలో కవులందరూ ధన్యులే’’.
ఆగస్టు 31, 1994 వ తేదీన ఆరుద్ర 70 వ జన్మదినోత్సవాన్ని రాజమండ్రి ఆనం కళాకేంద్రంలో అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఆ ఉత్సవ కమిటీకి నేను కార్యదర్శిని. సాయంత్రం జరిగిన అభినందన సభలో కూర్చునేందుకుగాని, నిలుచునేందుకుగాని స్థలం లేక వచ్చినవాళ్లు చాలామంది వెనుతిరగటం వాస్తవం. అటువంటి సందర్భంలో వేదిక మీద ప్రసంగించిన వారిలో అద్దేపల్లి రామమోహనరావు ఒకరు. ఆయన ప్రత్యేకించి, ఆరుద్ర గ్రంథం ‘‘త్వమేవాహం’’ గురించి ప్రసంగించారు.
‘‘మధ్యతరగతి మనస్తత్వాన్ని మొదటి సారిగా తెలుగు కవిత్వంలో సంచలనా త్మకంగా రూపొందించిన కవి ఆరుద్ర’’ అంటారాయన. ‘త్వమేవాహం’ లోని మధ్యతరగతి మనస్తత్వం చిత్రీకరణ కున్న ప్రాధాన్యతని ఆ సభలో వివరించారు.
ఆరుద్ర గొప్ప వ్యాసకర్త. ఈ మాట చల్లా రాధాకృష్ణశర్మ అన్నది. ఒక ఉదాహరణ కూడా చెప్పారాయన. అది 1965 వ సంవత్సరం. మద్రాసులో ‘‘సారస’’ అనే సాహిత్య సంస్థ ప్రారంభించారు. 1967 సంవత్సరంలో ఆ సంస్ధ జరిపిన సమావేశంలో ఆరుద్ర ‘‘నేటి కవిత్వంలో కొత్త పోకడలు’’ అనే అంశం మీద ప్రసంగ వ్యాసం చదివి, వినిపించారు. 1947` 1967 మధ్యకాలంలో తెలుగు కవిత్వంలో చోటు చేసుకున్న వివిధ పోకడలు గురించి సవిస్తరంగా వివరించటం జరిగింది.
‘‘ఆరుద్ర జీవితం ఒక కావ్యం/ ప్రతి పుట చదవదగినది/ప్రతి సర్గ అర్థం చేసుకోవలసినది’’ అన్నారు తిమ్మరాజు వెంకటశివరావు.
ఆరుద్రకి వి.ఆర్.బొమ్మారెడ్డితో మంచి అనుబంధం ఉండేది. పుచ్చలపల్లి సుందరయ్య అంటే అమితమైన అభిమానం, గౌరవం. ‘‘విశాలాంధ్రలో ప్రజాస్వామ్యం’’ అనే సుందరయ్య పుస్తకం చదివి, వారి నాయకత్వంలోని నాణ్యత, ధ్యేయం, గమ్యం, నన్ను ఉద్యుక్తుణ్ణి చేశాయని బొమ్మారెడ్డికి ఉత్తరం రాసారట ఆరుద్ర.
అందరి మెప్పు కోసం పాకులాడకుండ, నిష్కర్షగా తాను మార్క్సిస్టునని అన్ని వేళలా ప్రకటించుకున్న ఆరుద్రలో ఎన్నో గొప్ప గుణాలున్నాయి అన్న మోటూరి హనుమంతరావు మాటను గౌరవించాలి. ఆరుద్ర గురించి జయధీర్ తిరుమలరావు ఒక మాటంటారు. ‘‘మాలాంటి వాళ్లు ఆయన చెప్పే సమాచారం వింటూ తబ్బిబ్బు పడిపోతాం. ఒక్కసారి కళ్లు మిరుమిట్లు గమ్ముతాయి. సమాచార సార్వభౌముడు తన చేతిలోని ముడి వజ్రాన్ని ‘కోహినూర్’ అంటాడు. మెరుపు రాయిని వజ్రం చేసే మెథడాలజీ కోసం వెతుకులాడుతున్న అన్వేషిలా తనలోంచి తనలోకి పోతుంటాడు. చేతి ముందున్న సమాచారం చేజారిపోనివ్వకుండా కంటిలోకి, కంటి నుంచి మేధలోకి కదిలిస్తుంటాడు’’.
1985 వ సంవత్సరంలో అనుకుంటాను. ఆంధ్ర విశ్వకళాపరిషత్, ఆరుద్రని కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. అటువంటి మహాకవికి రాజమహేంద్రి సాహితీ ప్రేమికులతో పాటు ఉభయ గోదావరి సాహితీ ప్రియులందరు 1994 వ సంవత్సరంలో సాహితీ పక్షోత్సవం నిర్వహించి అభినందించారు.
పదము పదమున తేనెలూరగ
పాట చందము మనసు మెచ్చగ
కవిత యందున కాంతినింపిన/రుద్రుడితడే! ఆరుద్ర!
విశ్వ సాహితి విలువ లెరింగి
శాస్త్రగతులను తరచి చూచీ
విజయ మార్గం పట్టి నడిచిన/రుద్రుడితడే! ఆరుద్ర!
జ్ఞాన సంపద నిండి మెండుగ
తరం మారిన గొప్ప నిధులను
భవిత ముంగిట నిలిపి మురిసిన
రుద్రుడితడే! ఆరుద్ర!
(ఆరుద్ర శత వార్షికోత్సవ ప్రారంభం సందర్భంగా…)