ముంబై : పన్ను ఎగవేత ఆరోపణలపై మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ కుటుంబ సభ్యులు, కొంతమంది రియల్ ఎస్టేట్ డెవలపర్లతో సంబంధం ఉన్న కొన్ని వ్యాపారాలపై ఆదాయపు పన్ను శాఖ గురువారం దాడులు చేసింది. మహారాష్ట్రలోని ముంబై, పూనే, సతారా సహా మరికొన్ని నగరాల్లో, గోవాలో సోదాలు జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. డీబీ రియాల్టీ, షివాలిక్, జరందేశ్వర్ సహకారి షుగర్ ఖార్ఖానా (జరందేశ్వర్ ఎస్‌ఎస్‌కె) వంటి వ్యాపార గ్రూపులతో ముడిపడి ఉన్న వ్యాపార కేంద్రాలు, పవార్ సోదరీమణులకు సంబంధించిన వ్యాపారాలపై దాడులు జరిగినట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. దాడుల్లో ఐటీ అధికారులు కొన్ని కీలకపత్రాలను స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. జులైలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద సతారాలోని చిమాంగావ్-కోరెగావ్‌లో జరందేశ్వర్ ఎస్‌ఎస్‌కె షుగర్ మిల్లుకు చెందిన రూ.65 కోట్లకు పైగా విలువైన భూమి, భవనం, ప్లాంట్,యంత్రాలను జప్తు చేసింది. ఈ సహకార చక్కెర కర్మాగారం పవార్, అతని కుటుంబంతో ముడిపడి ఉందని ఈడీ పేర్కొంది.
యడియూరప్ప సన్నిహితుడి ఇంట్లో తనిఖీలు
కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో ఐటీ సోదాలు కలకలం సృష్టించాయి. కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప సన్నిహితుడు సహా వ్యాపారవేత్తలు, గుత్తేదారులు, చార్టెడ్ అకౌంటెంట్ల నివాసాల్లో ఐటీ అధికారులు విస్తృతంగా సోదాలు చేపట్టారు. పన్ను ఎగవేత ఆరోపణలపై నగరంలోని 50కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున 5 గంటల నుంచి సోదాలు చేపట్టారు. మొత్తం 300 మంది అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో 120కి పైగా కార్లను సీజ్ చేసినట్లు సమాచారం. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప సన్నిహితుడు అమిత్ ఉమేశ్ నివాసంలోనూ ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఉమేశ్ నివాసం, కార్యాలయాలు, బంధువులకు చెందిన మొత్తం 6 ప్రాంతాల్లో తనిఖీలు చేసిన అధికారులు వివిద పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక ఇరిగేషన్ విభాగానికి చెందిన కాంట్రాక్టర్ల నివాసాల్లోనూ సోదాలు చేశారు.
ఎన్‌సీపీ నేతలు లక్ష్యంగా బీజేపీ కుట్ర : జయంత్ పాటిల్
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కుటుంబం లక్ష్యంగా ఐటీ దాడులు జరుగుతుండటంపై మహారాష్ట్ర కేబినెట్ మంత్రి జయంత్ పాటిల్ స్పందిస్తూ.. ఎన్‌సీపీ నాయకులను అపఖ్యాతి పాల్జేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. పూణేలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఇది ముమ్మాటికీ బీజేపీ కుట్రే..ఈడీ, ఐటీ, సీబీఐలను తమ నాయకులపై ప్రయోగించి అపఖ్యాతి కలిగించేందుకు యత్నిస్తోంది.. ఇది తాను ఎప్పట్నించో చెబుతున్నాను’ అన్నారు. ఎన్‌సీపీని చూసి బీజేపీ ఎందుకు భయపడటం ఆశ్చర్యంగా ఉందన్నారు.