శ్రీనగర్ : ఇటీవల భారత్`పాకిస్థాన్ మధ్య టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ జరిగిన సందర్భంగా… పాక్ గెలుపును ఉదహరిస్తూ వాట్సాప్‌లో స్టేటస్ పెట్టుకున్న ఆగ్రాకు చెందిన కాలేజీ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేయడంపై పీపుల్స్ డెమెక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అభ్యంతరం తెలిపారు. తక్షణమే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టుకాబడిన విద్యార్థులు ఉత్తరప్రదేశ్‌లోని రాజ్ బల్వంత్ సింగ్ మేనేజ్‌మెంట్ టెక్నికల్ క్యాంప్‌స్‌కు చెందిన వారు. బుధవారం వారిపై జగదీశ్‌పుర పోలీసుస్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైనట్టు పోలీసులు తెలిపారు. ‘భారతదేశ ఔన్నత్యాన్ని బీజేపీ నకిలీ దేశభక్తి మంటగలుపుతోంది. తక్షణమే విద్యార్థులు విడుదల చేయాలి’ అని ముఫ్తీ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఘటన జరిగిన సమయంలో దేశానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఎలాంటి నినాదాలు చేయలేదన్న ఆగ్రా కళాశాల అధికారులు చెప్పిన విషయాన్ని ఓ మీడియా రిపోర్టు చేయగా, ఆ రిపోర్టును ఊటంకిస్తూ ముఫ్తీ ఈ డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఇప్పటికే కాలేజీ అధికారులు బీజేపీ కార్యకర్తలపై ఫిర్యాదు కూడా చేశారు.