ప్రతిపక్ష ఎంపీల నిరసన
న్యూదిల్లీ : జీవిత బీమా, ఆరోగ్య బీమా పై 18% జీఎస్టీ విధించడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇండియా ఐక్యసంఘటనకు చెందిన ఎంపీ లు మంగళవారం పార్లమెంటు వెలుపల ఆందోళన చేశారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి ముందు ఆరోగ్య, జీవిత బీమా పాలసీలపై ఉన్న 18 శాతం జీఎస్టీని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ భవనం మకర ద్వారం ముందు ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ ఆందోళనలో రాహుల్ గాంధీతో పాటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా పాల్గొన్నారు. తెలంగాణ నుంచి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొని ప్రభుత్వ విధానా లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీలు మాట్లాడుతూ… నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యులపై భారం మోపేలా ఉంద న్నారు. పేద వారిని దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్టిన బడ్జెట్ కాదని విమర్శించారు. అంబానీ, అదానీలకు మేలు చేసేలా కేంద్ర బడ్జెట్ ఉందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి హెల్త్, లైఫ్ ఇన్సూరెన్సులపై విధించిన 18% జీఎస్టీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీఎంసీ నేత డెరిక్ ఒబ్రెయిన్ సోమవారం ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తిన విషయం తెలిసిందే. అధిక పన్ను ప్రజలకు భారంగా మారుతున్నట్లు తెలిపారు. రాజ్యసభలో జీరో అవర్‌లో ఆయన మాట్లడారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఇదే రకమైన డిమాండ్ చేసినట్లు ఆయన ఆర్థిక మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని, ఆర్థిక మంత్రి కనీసం రోడ్డు, రవాణా శాఖ మంత్రి గడ్కరీ వ్యాఖ్యలను అయినా ఆలకించాలని టీఎంసీ ఎంపీ తెలిపారు.జీఎస్టీ మండలి మాత్రమే దీనిపై నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వం చెప్పిన విషయాన్ని ఎంపీ ఒబ్రెయిన్ తిరస్కరించారు. ఆ వాదనలో వాస్తవం లేదన్నారు. మండలిలో ఎన్డీఏకు మెజారిటీ ఉన్నదని, కావాలంటే దీన్ని మార్చవచ్చు అని తెలిపారు.