న్యూదిల్లీ : దేశంలో విమానయాన టర్బైన్ ఇంధనం (ఏటీఎఫ్) రేటు కంటే పెట్రోలు ధర అధికంగా ఉండటంపై కాంగ్రెస్ పార్టీ మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడిరది. కేంద్రం ‘పన్ను దోపిడీ’కి పాల్పడుతోందని పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ పేర్కొనాగా, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా కూడా ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ‘హవాయి చప్పల్స్’ ధరించిన వారిని విమానంలో ప్రయాణించేలా చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, పెట్రోల్ డీజిల్ ధరలను దారుణంగా పెంచింది. దీని వల్ల మధ్యతరగతి ప్రజలు రోడ్డుపై ప్రయాణించడం కూడా కష్టంగా మారిందని ట్విట్టర్ ద్వారా ఎద్దేవా చేశారు. కాగా విమానయాన సంస్థలకు విక్రయించే ఏటీఎఫ్ రేటు కంటే మూడవ వంతు ఎక్కువ ధర కలిగిన ఆటో ఇంధనాలపై మీడియా నివేదికను ట్యాగ్ చేస్తూ.. ఇది చాలా తీవ్రమైన సమస్య అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘ఈరోజు నెరవేరని ప్రజల సాధారణ అవసరాలు ఎన్నికల ముందు గుర్తుకు వస్తాయి.. మోదీ స్నేహితుల ప్రయోజనాల కోసం మోసపోతున్న వ్యక్తులతో నేను ఉన్నాను.. వారి గొంతుకను పెంచడం కొనసాగిస్తాను’ అని రాహుల్ హిందీలో ట్వీట్ చేశారు. కాగా కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో విమానయాన సంస్థలకు విక్రయించే ఇంధన రేటు కంటే ఆటో ఇంధనాల ధర ఎక్కువగా ఉండటం మోదీ ప్రభుత్వ దోపిడీ కి నిదర్శనం అని తెలిపింది.