‘ఆశా’లకు రూ.10 వేల గౌరవ వేతనం
ప్రియాంక గాంధీ వాద్రా
న్యూదిల్లీ : ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్తలు(ఆశా) చేస్తున్న పనిని ‘అవమానింది’ అని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం విమర్శించారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ అధికారంలోకి వస్తే ఆశా, అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిసేందుకు వచ్చిన ఆశా కార్యకర్తలపై షాజహాన్‌పూర్‌లో పోలీసులు దాడికి సంబంధించిన వీడియోను ఆమె సామాజిక మాధ్యమం ట్విటర్‌లో షేర్ చేశారు. ‘యూపీ ప్రభుత్వం మన ఆశా సోదరీమణులపై చేసిన ప్రతి దాడి వారి పనిని అవమానించడమే. నా ఆశా సోదరీమణులు కరోనా వైరస్ సమయంలో, ఇతర కార్యక్రమాల సందర్భంగా నిబద్ధతతో సేవలు అందించారు. గౌరవ వేతనం వారి హక్కు. వారి మాట వినడం ప్రభుత్వం బాధ్యత’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హిందీలో ఒక ట్వీట్ చేశారు. ఆశా సోదరీమణులు గౌరవానికి అర్హులు. ఈ పోరాటంలో నేను వారితో ఉన్నా’ అని ఆమె తెలిపారు. ఆశా సోదరీమణుల గౌరవ వేతనం, వారి గౌరవం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, ప్రభుత్వ ఏర్పాటు సందర్భంగా ఆశా, అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు రూ.10 వేలు గౌరవ వేతనం అందజేస్తామని ప్రియాంక పేర్కొన్నారు. రాష్ట్రంలో గోశాలలు అధ్వానంగా ఉన్నాయని, దిద్దుబాటుకు చర్యలు తీసుకోవాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంపై మరొక ట్వీట్‌లో ఆమె ధ్వజమెత్తారు.