ప్రధానికి చన్నీ విజ్ఞప్తి
చండీగఢ్: వేర్పాటువాదులకు అరవింద్ కేజ్రీవాల్ మద్దతిస్తున్నారని ఆప్ మాజీ నాయకుడు కుమార్ విశ్వాస్ చేసిన ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించాల్సిందిగా ప్రధాని నరేంద్రమోదీకి పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌సింగ్ చన్నీ విజ్ఞప్తి చేశారు. కుమార్ విశ్వాస్ ఆరోపణలను ఆప్ నాయకుడు రాఘవ్ చద్దా ఇప్పటికే ఖండిరచారు. అవన్నీ నిరాధార ఆరోపణలని, కల్పితాలని కొట్టిపారేశారు. కుమార్ విశ్వాస్ విడుదల చేసిన వీడియో వ్యవహారంపై నిష్పక్షపాత దర్యాప్తునకు ఆదేశించాల్సిందిగా పంజాబ్ ముఖ్యమంత్రిగా మోదీకి విజ్ఞప్తి చేస్తున్నట్లు చన్నీ ట్వీట్ చేశారు. రాజకీయాలను పక్కన పెట్టి…వేర్పాటువాదంపై పోరులో పంజాబ్ ప్రజలు భారీ మూల్యం చెల్లించుకున్నారని, ప్రతి పంజాబీ ఆందోళనను ప్రధాని పరిష్కరించాల్సిన అవసరం ఉందని చన్నీ పేర్కొన్నారు. మోదీ సైతం గురువారం అబోహర్‌లో ఎన్నికల ప్రచారం చేస్తూ కుమార్ విశ్వాస్ పేరును ప్రత్యక్షంగా ప్రస్తావించకుండా కేజ్రీవాల్‌పై చేసిన ఆరోపణలు గుర్తుచేశారు. కేజ్రీవాల్‌కు ఒకప్పటి సన్నిహిత మిత్రుడు చేసిన ఆరోపణలు అత్యంత ప్రమాదకరమైందని, కేజ్రీవాల్ అభిప్రాయాలను ఆయన వివరించారని మోదీ చెప్పారు. కుమార్ విశ్వాస్ ఆరోపణలపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ సైతం స్పందించారు. ఈ ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వేర్పాటువాదులకు మద్దతిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ పంజాబ్ రాష్ట్ర అధ్యక్షుడు నవజ్యోత్‌సింగ్ సిద్ధూ, ఇతర కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. మరోవైపు, విశ్వాస్ వద్ద అలాంటి సమాచారమే ఉంటే 2017 నుంచి ఇప్పటి వరకు ఎందుకు మౌనంగా ఉన్నారని చద్దా నిలదీశారు. ఎన్నికలకు ఒకరోజు ముందు ఈ విషయాలను ఎందుకు లేవనెత్తారని అడిగారు. ఉగ్రవాదులకు కేజ్రీవాల్ మద్దతిస్తున్నట్లు ఏదైనా సమాచారమంటే భద్రతా, దర్యాప్తు సంస్థలకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. అందులో కుమార్ విశ్వాస్ కూడా భాగస్వామిగా ఉన్నారా?ఇంతకాలం ఎందుకు మౌనంగా ఉన్నారని చద్దా అడిగారు. ‘2018 వరకు ఆయన పార్టీలోనే ఎందుకున్నారు? పార్టీని ఎందుకు వీడలేదు? వాస్తవం ఏమంటే కుమార్ విశ్వాస్‌కు రాజ్యసభ సీటు ఇవ్వలేదు. అందుకే ఎన్నికల వేళ ఆయన ఇలాంటి తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్నారు’ అని చద్దా వివరించారు.