ఇల్లు కూలి ఇద్దరు చిన్నారులు మృతి
మల్లప్పురం : కేరళలోని అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున కరిపూర్ సమీపంలో ఇల్లు కూలిన ఘటనలో ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఆరు నెలల చిన్నారి, ఆమె ఎనిమిదేళ్ల సోదరి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక్కడ ముందోత్తుపదమ్ సమీపంలోని మఠంకుళంలో కూలిన ఇల్లు.. ఈ చిన్నారుల తాతకు చెందినదని వివరించారు. తెల్లవారుజామున దాదాపు 4.30 గంటల సమయంలో భారీ వర్షం కారణంగా బాధితుల ఇంటిపై సమీపంలో నిర్మాణంలో ఉన్న ఇల్లు కూలిపోవడంతో ఈ విషాదం చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. కాగా ప్రమాదం జరిగిన వెంటనే చిన్నారులు ఇద్దరినీ కోజికోడ్ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించినప్పటికీ వారి ప్రాణాలను రక్షించలేకపోయారు. సోమవారం నుంచి కేరళలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో మంగళవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం సోమవారం తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ప్రస్తుతం తుపాను ప్రసరణ ఉందని, వచ్చే మూడు రోజులపాటు అది కొనసాగే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఫలితంగా అక్టోబరు 11 నుంచి 15వ తేదీల్లో కేరళలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.