సీఎం పినరయి విజయన్
తిరువనంతపురం : రాష్ట్రంలో మహిళలపై లైంగిక వేధింపు ఘటనలు, సంబంధిత నేరాలు తగ్గుముఖం పట్టాయని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గురువారం తెలిపారు. ఏ మహిళపై వేధింపులు లేని సమాజాన్ని సృష్టించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అసెంబ్లీ జీరో అవర్‌లో వామపక్ష ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష యూడీఎఫ్ విమర్శలు చేసినప్పుడు ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇటీవల మహిళలపై అత్యాచారాలు, హింసాత్మక ఘటనలను విజయన్ నేతృత్వంలోని హోం శాఖ సమర్థవంతంగా పరిష్కరించింది. గణాంకాలను ఉటంకిస్తూ, ముఖ్యమంత్రి మాట్లాడుతూ, 2016లో మహిళలపై 15,114 కేసులు నమోదు కాగా, 2020లో 12,659కు, అత్యాచార కేసులు 2017లో 2,003 నుంచి 2020లో 1,880కు తగ్గాయని, అలాగే మహిళలపై దాడి కేసులో 2017లో 4,413కు గాను 2020లో 3,890 మాత్రమే నమోదయినట్లు వివరించారు. కట్నం వేధింపుల నేపథ్యంలో మరణాల సంఖ్య 2017లో నమోదయిన 12 నుంచి 2020లో కేవలం ఆరుకు పడిపోయాయని ఆయన చెప్పారు. ‘2016`2021 సంవత్సరాల మధ్యలో లైంగిక వేధింపులు, సంబంధిత నేరాలు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు తగ్గుతున్నాయని అన్నారు. కానీ ప్రభుత్వం దానితో సంతృప్తిం చెందడం లేదని, మహిళలపై వేధింపు లేని సమాజాన్ని సృష్టించాలన్నదే మా ధ్యేయం’ అని విజయన్ తెలిపారు. మహిళలపై నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు వరుస కార్యక్రమాలను ప్రారంభించామని చెప్పారు. ఈ అంశంపై వాయిదా తీర్మానానికి నోటీసులిచ్చిన శాసనసభ్యుడు రోజి ఎం జాన్ (కాంగ్రెస్) చేసిన ఆరోపణపై విజయన్ స్పందిస్తూ, మహిళలపై దాడుల విషయంలో ఉత్తర భారతదేశంలో కంటే దక్షిణాది రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఆత్మపరిశీలన చేసుకోవాలని, ఇలాంటి కేసుల్లో దోషులకు గరిష్ఠంగా శిక్ష పడేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని విజయన్ అన్నారు. అయితే గత మూడు నెలల్లో కేరళలో మూడు గ్యాంగ్ రేప్‌లు నమోదయ్యాయని, మహిళలపై దాడులను అరికట్టడంలో పోలీసులు, హోం శాఖ విఫలమయ్యాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అత్యాచారం, ఇతర నేరాల వరుసను జాబితా చేస్తూ, ఈ అంశంపై కూడా సభలో చర్చ జరగాలని వారు కోరారు. ‘’మహిళలపై దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కేరళలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయా అని కూడా కొన్ని సంఘటనలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ముఖ్యమంత్రి తన సౌలభ్యం ప్రకారం ఇక్కడ కొన్ని గణాంకాలను చదివి, అసలు డేటాను వెల్లడిరచలేదు’ అని జాన్ ఆరోపించారు. ముఖ్యమంత్రి సమాధానం ఆధారంగా స్పీకర్ ఎంబీ రాజేష్ తీర్మానానికి అనుమతిని తిరస్కరించడంతో సభ నుంచి విపక్ష సభ్యులు వాకౌట్ చేశారు.