. ఎన్డీఏ ప్రభుత్వం ఎదుట అనేక సవాళ్లు
. 6 రాజ్యాంగ సవరణలు అవసరం
. లోక్‌సభ, రాజ్యసభలో సరిపోని సంఖ్యాబలం
. ఇప్పటికే వ్యతిరేకిస్తున్న విపక్షాలు
న్యూదిల్లీ : దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రూపొందించిన నివేదికను కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన క్రమంలో దేశంలో జమిలి ఎన్నికలపై రాజకీయవేడి రాజుకుంది. అనుకూల, ప్రతికూల వాదనలు ఎలా ఉన్నా దీనిని ఆచరణలో పెట్టడం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి అంత సులువేమీ కాదు. దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంటుతో పాటు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలంటే సుమారు 6 రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం అందుకు సగం రాష్ట్రాల ఆమోదం కావాలి. ప్రస్తుతం లోక్ సభ, రాజ్యసభల్లో ఎన్‌డీఏ ప్రభుత్వానికి ఉన్న సొంత బలం సరిపోదు. జమిలి కోసం అదనపు ఎంపీల మద్దతు కూడగట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇప్పటికే ఇండియా ఐక్యసంఘటన ఈ ప్రతిపాదనను వ్యతిరేకి స్తోంది. ఈ క్రమంలో జమిలి ఎన్నికల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. ఇక జమిలి అంటే పార్లమెంటుతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకూ ఏకకాలంలో ఎన్నికలు జరిపించాలి. నిజానికి 1951 నుంచి 1967 దాకా దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు జరిగాయి. తర్వాత వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలడం వల్ల మధ్యంతర ఎన్నికలొచ్చి జమిలి మాయమై ఆయా రాష్ట్రాల అసెంబ్లీల గడువులు మారాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వీటన్నింటినీ రానున్న సార్వత్రిక ఎన్నికలతో కలపాలంటే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల గడువును పెంచడమో, మరికొన్నింటిని తగ్గించడమో చేయాలి. లోక్‌సభ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఈ మార్పులు తప్పవు. ఇందుకు రాజ్యాంగ పరంగా అవరోధాలున్నాయి. దేశంలో వివిధ ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులు, మార్గదర్శ కాలకు ఉద్దేశించిన 1951 ప్రజాప్రాతినిథ్య చట్టానికి సవరణలు చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు పలు కీలక రాజ్యాంగ సవరణలకు పార్లమెంటు ఆమోద ముద్ర వేయాలి. ప్రధానంగా 6 రాజ్యాంగ సవరణలు అవసరం. లోక్‌సభ, రాజ్యసభల కాలపరిమితికి సంబంధించిన ఆర్టికల్ 83, రాష్ట్రాల అసెంబ్లీలకు ఐదేళ్ల గడువును నిర్దేశించే ఆర్టికల్ 172(1 ), రాష్ట్రపతికి లోక్‌సభను రద్దు చేసే అధికారాలిచ్చే ఆర్టికల్ 85 (2) (బి), రాష్ట్ర అసెంబ్లీల రద్దు అధికారం గవర్నర్‌కు దఖలు పరిచే ఆర్టికల్ 174 (2) (బి)కి సవరణలు చేయాలి. రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనకు వీలు కల్పించే ఆర్టికల్ 356, ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన ఆర్టికల్ 324కు సవరణలు చేయాల్సి ఉంటుంది. ఈ రాజ్యాంగ సవరణలను పార్లమెంటు 2/3 మెజారిటీతో ఆమోదించాలి. ప్రస్తుతం లోక్‌సభలో బీజేపీ ఆ మార్కు దాటాలంటే సొంత బలగంతో పాటు అదనంగా ఎంపీల మద్దతు కూడ గట్టాల్సి ఉంటుంది. రాజ్యసభలో మరింత ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. ఇటీవల సార్వత్రిక ఎన్నికల అనంతరం లోక్‌సభలో ప్రస్తుతం ఎన్‌డీఏకు 293 ఎంపీల బల ముంది. జమిలి ఆమోదానికి 362 మంది ఎంపీల మద్దతు అవసరం. ఇక రాజ్యసభలో ఎన్‌డీఏ బలం 121 కాగా జమిలి ఆమోదానికి 164 మంది ఎంపీల మద్దతు కావాల్సి ఉంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే కాకుండా సమాఖ్య వ్యవస్థ కలిగిన దేశం కావడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాల మాటకూ విలువ ఉంటుంది. పార్లమెంటుతో పాటు దేశంలోని సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఇందుకు అంగీకరించాలి. అంటే 14 రాష్ట్రాలకు పైగా జమిలికి సరేననాలి. ప్రస్తుతం బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ సొంతంగా 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అందులో బీజేపీ సొంతంగా 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ఒకేసారి మహిళా రిజర్వేషన్లు, లోక్‌సభ సీట్ల పెంపు, జమిలి ఎన్నికల విధానాన్ని అమలుచేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ ఎన్‌డీఏ సర్కార్ ఎలా అమలు చేస్తుందనే విషయమై ఆసక్తి నెలకొంది.