. జనజీవనం అస్తవ్యస్తం
. యూపీలో 9 మంది, రాజస్థాన్‌లో ఐదుగురి మృతి
న్యూదిల్లీ : రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అనేక రాష్ట్రాల్లో నదులు పొంగిపొర్లుతున్నాయి. వరదలు సంభవిస్తున్నాయి. పర్వత రాష్ట్రాలయిన ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో మేఘ విస్ఫోటనం విధ్వంసానికి దారితీసింది. వరదల వంటి పరిస్థితి మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, అనేక ఇతర రాష్ట్రాలలోని ప్రజల రోజువారీ జీవితానికి అంతరాయం సృష్టించింది.ఉత్తర ప్రదేశ్‌లోని ఏడు జిల్లాల్లో సోమవారం సాయంత్రం వరకు 24 గంటల్లో వర్షాల కారణంగా తొమ్మిది మంది మరణించారని రాష్ట్ర సహాయ కమిషనర్ కార్యాలయం తెలిపింది.
తొమ్మిది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తన తాజా వాతావరణ బులెటిన్‌లో అల్పపీడనం ప్రభావం కారణంగా రాబోయే రోజుల్లో తూర్పు, వాయువ్య భారతదేశంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అసోం, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్‌కు భారీ వర్షపాతం ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తరాఖండ్, రాజస్థాన్, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లో వారమంతా ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దిల్లీ, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్‌లో ఇదే సమయంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఆగస్టు 9 వరకు మధ్య మహారాష్ట్ర, పశ్చిమ మధ్య ప్రదేశ్, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలలో, చత్తీస్‌గఢ్, తూర్పు మధ్య ప్రదేశ్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. గోవా, కొంకణ్, నాగాలాండ్, మిజోరాం, త్రిపుర, అసోం, మణిపూర్, మేఘాలయాతో సహా ఈశాన్య ప్రాంతాలలో ఈనెల 10వ తేదీ వరకు గణనీయమైన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. బీహార్, తమిళనాడులో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. రాజధాని దిల్లీలో మంగళవారం కనిష్ఠ ఉష్ణోగ్రత 26.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయింది. రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ దిల్లీలో ‘ఎల్లో అలర్ట్’ ప్రకటించింది. ఇదిలాఉండగా, హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా, కాంగ్రా, సిర్మౌర్ జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో బుధవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన ‘ఆరెంజ్’ అలర్ట్‌ను సిమ్లాలోని వాతావరణ కేంద్రం జారీ చేసింది. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించడం, కొండచరియలు విరిగిపడటంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో 75 రోడ్లను మూసివేశారు. దాదాపు వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కొండ ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. కులు, మండి, సిమ్లా జిల్లాల్లో మేఘ విస్ఫోటనం సంభవించిన ఆకస్మిక వరదల్లో 13 మంది మరణించారు. 40 మంది ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. మరోవైపు, ఉత్తరాఖండ్‌లో 1,400 మందికి పైగా ప్రజలు కేదార్‌నాథ్‌కు వెళ్లే నడక మార్గంలో వర్షాల కారణంగా చిక్కుకుపోయిన వారిని సోమవారం సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారతీయ వైమానిక దళం (ఐఏఎఫ్) కు చెందిన చినూక్, ఎంఐ17 హెలికాప్టర్లు యాత్రికుల తరలింపులో సహాయపడ్డాయని అధికారులను ఉటంకిస్తూ పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. 136 మంది యాత్రికులను ఐఏఎఫ్, రాష్ట్ర హెలికాప్టర్లు రక్షించగా, 509 మందిని కేదార్‌నాథ్ నుంచి కాలినడకన లించోలికి తీసుకువచ్చి హెలికాప్టర్లలో చార్ధామ్, షెర్సీ హెలిప్యాడ్‌లకు పంపినట్లు విపత్తు నిర్వహణ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ తెలిపారు. గత గురువారం సహాయక చర్యలు ప్రారంభించినప్పటి నుంచి 11,775 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఏడు జిల్లాల్లో వర్షాల కారణంగా తొమ్మిది మంది మరణించారని రాష్ట్ర సహాయ కమిషనర్ కార్యాలయం తెలిపింది. ఏడుగురు నీట మునిగి చనిపోగా, ఇద్దరు పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. పాముకాటు కారణంగా బండా, ప్రతాప్‌గఢ్ జిల్లాల్లో మరణాలు నమోదవగా, షామ్లీ, ఖుషీనగర్, బలరామ్‌పూర్, చిత్రకూట్‌లో వరదలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. రిలీఫ్ కమిషనర్ జి.ఎస్.నవీన్ కుమార్ మాట్లాడుతూ 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 3.7 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని తెలిపారు. జూన్ 1 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో సగటు వర్షపాతం 344.7 మిల్లీమీటర్లు నమోదయింది.
రాజస్తాన్‌లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా జరిగిన ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందగా, ఒకరు గల్లంతయ్యారని పోలీసు తెలిపారు. వాతావరణ శాఖ ప్రకారం, రాజస్తాన్‌లోని టోంక్, పాలి, బుండి, భిల్వారా జిల్లాల్లో గత 24 గంటల్లో భారీ వర్షాలు కురిశాయి. జోధ్‌పూర్‌లోని బోరనాడ ప్రాంతంలో ఫ్యాక్టరీ గోడ కూలిపోవడంతో 13 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. వీరిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పాళీలో ఒక ద్విచక్ర వాహనదారుడు బలమైన ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందాడు. సోజత్ ప్రాంతంలో కచ్చా ఇల్లు కూలిపోవడంతో గీతాదేవి మృతి చెందిందని వారు తెలిపారు. తన స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళ్లిన ఓ వ్యక్తి సెల్ఫీ తీసుకుంటూ భిల్వారాలోని బిజోలియాలోని మెనాల్ జలపాతంలో 150 అడుగుల కింద పడిపోయాడు. అతని ఆచూకీ ఇంకా లభించలేదని, గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. అసోం రాజధాని గువహటిలో మంగళవారం ఉదయం కురిసిన భారీ వర్షానికి అనేక ప్రాంతాలు నీట మునిగాయి. షిల్లాంగ్‌కు వెళ్లే రహదారిపై వరద నీరు చేరడంతో వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ అంతరాయాల్లో గంటల తరబడి చిక్కుకున్న ప్రయాణికులు, విద్యార్థులు అసౌకర్యానికి గురయ్యారు. దీంతో అన్ని విద్యాసంస్థలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కర్నాటక రాష్ట్రం బెంగళూరులోని అనేక ప్రాంతాలు భారీ వర్షానికి నీట మునిగాయి. నగరంలోని నాగవర, హెబ్బాల్ మధ్య ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్), కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (కేఐఏ) కూడలి, అలాగే నగరంలోని అనేక ప్రాంతాల్లో వరద నీరు చేరింది. కెంపెగౌడ విమానాశ్రయానికి వెళ్లే ట్రాఫిక్‌కు కూడా అంతరాయం ఏర్పడిరది. ఉత్తర కేరళ జిల్లాలో భారీ కొండచరియలు విరిగిపడి వందలాది మంది మరణించిన వారం తర్వాత మంగళవారం శోధన కార్యకలాపాలు ముమ్మరం అయ్యాయి. చాలియార్ నదీ పరీవాహక ప్రాంతంలో హెలికాప్టర్‌లో ప్రత్యేక బృందంతో మృతదేహాలు లేదా అవశేషాల కోసం గాలింపు చేపట్టినట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది. జిల్లా కలెక్టర్ మేఘశ్రీ డిఆర్ విలేకరులతో మాట్లాడుతూ పాఠశాల సమీపంలోని నది, గ్రామం, దిగువ ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి సారించామని వివరించారు.