ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్
న్యూదిల్లీ : కోవిడ్`19 మహమ్మారి కారణంగా భారతదేశ ప్రజలకు ఇటీవలి సంవత్సరాల్లో దేశ ఆర్థిక భవిష్యత్తుపై విశ్వాసం సన్నగిల్లిందని భారత రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. మహమ్మారి వారి ఆలోచనలను దెబ్బతీసిందని, దీంతో చాలా మంది మధ్యతరగతి ప్రజలు పేదరికంలో కూరుకుపోయారని అన్నారు. శుక్రవారం నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. వృద్ధి చెందుతున్న స్టాక్ మార్కెట్ ఎంతో మంది భారతీయులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారనే వాస్తవాన్ని ప్రతిబింబించడం లేదని తెలిపారు. ‘ఇటీవలి సంవత్సరాలలో ఆత్మవిశ్వాసం కాస్త తగ్గింది. ఆర్థిక భవిష్యత్తుపై నమ్మకం తగ్గింది. కోవిడ్ మహమ్మారి కేసుల సంఖ్య మన ఆత్మవిశ్వాసాన్ని మరింత తగ్గించింది. మధ్యతరగతిలో చాలా మందిని పేదరికంలోకి నెట్టింది’ అని ఆయన అన్నారు. కాగా కేంద్ర బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దేశ వృద్ధి అంచనాను దాని మునుపటి అంచనా 10.5 శాతం నుండి 9.5 శాతానికి తగ్గించింది. అలాగే అంతర్జాతీయ ద్రవ్య నిధి 2021లో 9.5 శాతం, తదుపరి సంవత్సరంలో 8.5 శాతం వృద్ధిని అంచనా వేసింది. అయితే ఆర్థిక పథకాలు ఏవైనా ఉపాధి కల్పించేవిగా ఉండాలని, దానికి బదులుగా రాష్ట్రాలు స్థానికులకే ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయని రఘురామ రాజన్ తెలిపారు. ‘మన ఆర్థిక పని తీరు క్షీణిస్తున్నందున, మన ప్రజాస్వామ్య ప్రమాణాలు, చర్చకు, విభేదాలను గౌరవించటానికి, సహించటానికి మన సుముఖత కూడా దెబ్బతింటోంది. కేంద్రంలోనే కాకుండా చాలా రాష్ట్రాలలో సమాజ సెంటిమెంట్ చాలా తేలికగా దెబ్బతింటుందని మీకు తెలుసు’ అని అన్నారు.