మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌ను మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రశ్నిస్తున్నారు. బుధవారం ఉదయం ఈడీ అధికారులు నవాబ్ మాలిక్ నివాసానికి వచ్చినట్లు ఆయన కార్యాలయ సిబ్బంది ప్రకటించారు. అనంతరం నవాబ్ మాలిక్‌ను ఈడీ ఆఫీసుకు తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. మాలిక్ వెంట ఆయన కుమారుడితో పాటు లాయర్ అమీర్ మాలిక్ ఉన్నారు. దావూద్ ఇబ్రహీం, ఆయన అనుచరుల కార్యకలాపాలకు సంబంధించిన ఓ మనీలాండరింగ్ కేసులో మాలిక్‌ను ప్రశ్నిస్తున్నట్లు ఈడీ అధికారులను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ తెలిపింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఆయన స్టేట్‌మెంట్‌ను అధికారులు నమోదు చేసినట్లు తెలిపింది. ఈ విషయాన్ని నవాబ్ మాలిక్ కార్యాలయం కూడా ధ్రువీకరించింది.
కాగా ఈ ఘటనపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్రంగా స్పందించారు. నవాబ్ మాలిక్ సీనియర్ లీడర్. ఆయన మహారాష్ట్ర కేబినెట్ మంత్రి కూడా. అలాంటి వ్యక్తికి ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా ఈడీ ప్రశ్నించడం సరికాదన్నారు. కేంద్రం సంస్థలను బీజేపీ దుర్వినియోగ పరుస్తోందని మండిపడ్డారు. 2024 తర్వాత మీకు కూడా ఇదే గతి పడుతుంది.. గుర్తుంచుకోవాలని సంజయ్ రౌత్ సూచించారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నవాబ్ మాలిక్‌ను ఈడీ అధికారులు తమ కార్యాలయానికి తీసుకెళ్లి ప్రశ్నించడాన్ని మంత్రి జయంత్ పాటిల్ తప్పుబట్టారు. గత కొద్ది రోజుల నుంచి మాలిక్.. బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నందుకే ఈ చర్యలకు పాల్పడుతున్నారని పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ స్పందిస్తూ, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించినందుకు నవాబ్ మాలిక్‌ను ఈ విధంగా టార్గెట్ చేస్తారని తమకు తెలుసునని చెప్పారు. ఆయనపై కేసు గురించి తనకు తెలియదని, అయితే ప్రత్యర్థులను అప్రతిష్ఠపాలు చేయడానికి దావూద్ పేరును వాడుకుంటున్నారని ఆరోపించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను పని చేసిన కాలంలో తనకు కూడా అండర్ వరల్డ్‌తో సంబంధాలు ఉన్నట్లు ఆరోపించారన్నారు. పాతికేళ్ల తర్వాత అదే చిట్కాను ఉపయోగిస్తున్నారన్నారు.