వారణాసి బీజేపీ కార్యకర్తలకు మోదీ మార్గనిర్దేశం
సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించాలని సూచన
లక్నో:ఉత్తరప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో వారణాసి (మోదీ లోక్‌సభ నియోజకవర్గం) బీజేపీ నేతలు, కార్యకర్తలకు ప్రధాని మోదీ దిశా నిర్దేశం చేశారు. మంగళవారం నమో యప్ ద్వారా ఆయన మాట్లాడుతూ… రానున్న ఎన్నికల్లో ప్రతి ఓటు కూడా అత్యంత విలువైనదని అన్నారు. ప్రతి ఒక్కరికీ ఓటు విలువ ఏమిటో వివరంగా చెప్పాలని, వారు ఓటు వేసేలా చూడాలని సూచించారు. రైతుల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను వారికి వివరించాలని మోదీ తెలిపారు. రసాయనాలు లేని ఎరువుల గురించి వారిలో చైతన్యం తీసుకురావాలని చెప్పారు. వారణాసి ప్రజలకు పెద్ద స్థాయిలో లబ్ధి కలిగించిన కేంద్ర పథకాల గురించి కూడా చెప్పాలంటూ మోదీ కార్యకర్తలకు సూచించారు. బీజేపీ మైక్రో డొనేషన్ క్యాంపెయిన్ గురించి మోదీ ప్రస్తావించారు. పార్టీ నిధుల కోసం చిన్న మొత్తాల్లో విరాళాలు ఇవ్వాలని కోరారు. ఎన్నికల షెడ్యూల్ ని కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన తర్వాత పార్టీ కార్యకర్తలతో మోదీ మాట్లాడటం ఇదే ప్రథమం. మరోవైపు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ర్యాలీలు, పాదయాత్రలు, రోడ్ షోలపై జనవరి 22 వరకు ఈసీ నిషేధం విధించిన సంగతి విదితమే.