న్యూదిల్లీ : విద్యాబుద్ధులు నేర్పించి చిన్నారులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురువే కీచకుడిలా మారాడు. 11 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్‌లోని మహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మంగళవారం పాఠశాలకు వెళ్లిన బాలిక సాయంత్రం ఇంటికి రాకపోవడంతో… తండ్రి ఆమె కోసం వెతికాడు. బాలిక అదృశ్యమైన విషయం తెలుసుకున్న స్థానికులు ఉపాధ్యాయుడు సంజయ్ గుప్తా ఇంటి తలుపులు పగలగొట్టి… బాలికను రక్షించారు. అనంతరం అతడిని చితకబాదారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని టీచర్ సంజయ్ గుప్తాను అరెస్టు చేశారు. స్థానికుల దాడిలో తీవ్ర గాయాలపాలైన అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు మహ్మదాబాద్ పోలీస్ అధికారి దినేశ్ శుక్లా వెల్లడిరచారు. బాలికపై గుప్తా లైంగిక దాడికి పాల్పడ్డాడని, తన కోర్కెలు తీర్చకపోతే కొట్టడంతో పాటు స్కూల్‌లో ఫెయిల్ చేస్తానని బెదిరించాడని తెలిపారు. తమకు అందిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో సహా కొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని పోలీసులు వెల్లడిరచారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు.