బలియా(యూపీ): బైరియా అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీని ఓడిరచి తీరతానని ఆ పార్టీ మాజీనేత సురేంద్రసింగ్ ప్రతిజ్ఞ చేశారు. యూపీ ఎన్నికల్లో బీజేపీ తనకు టికెట్ నిరాకరించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. సురేంద్రసింగ్ ఇప్పటి వరకు బైరియా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. బైరియా నియోజకవర్గం నుంచి తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఇప్పటి వరకు చెబుతూ వచ్చిన సురేంద్రసింగ్…ఇటీవల వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ)లో చేరారు. ఆ పార్టీ టికెట్‌పై ఎన్నికల బరిలో నిలిచారు. సురేంద్రసింగ్ అనేకసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సమస్యలు సృష్టిస్తుంటారు. భారత్‌మాజీకీ జై చెప్పని వారంతా పాకిస్థానీయులే, 2024 నాటికి భారతదేశం హిందూదేశంగా మారుతుంది అంటూ ప్రకటనలు చేస్తూ వివాదాల్లో ఇరుక్కున్నారు. వాస్తవ పరిస్థితులు తెలియకుండా బీజేపీ పెద్దలు టికెట్లు కేటాయించారని ఆయన మండిపడ్డారు. పార్టీ కేవలం ఎన్నికల చిహ్నం మాత్రమే ఇస్తుందని, తమ గుండెల్లో ఉన్న నాయకుడికే ఓటర్లు ఓటేస్తారని సురేంద్రసింగ్ అన్నారు. ఐదేళ్లుగా తాను చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు బైరియాలో తనను గెలిస్తారని చెప్పారు. దిల్లీలోని ఏసీ గదుల్లో కూర్చున్న బీజేపీ పెద్దలు నైతికత గురించి, కష్టపడి పనిచేయడం గురించి మాట్లాడుతుంటారని, వారికి వాస్తవాలు తెలియదని విమర్శించారు. బీజేపీపై విమర్శలు చేస్తూనే ప్రధాని మోదీ, సీఎం యోగి తనకు ఆదర్శప్రాయులని చెప్పుకొచ్చారు.