గోవాను బొగ్గు కేంద్రంగా మారనివ్వం
ఎన్నికల ప్రచారం ప్రారంభించిన రాహుల్‌గాంధీ
పనాజీ : కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక (మేనిఫెస్టో) కేవలం ఓ వాగ్దానం కాదని, అది ఓ అభయమని ఆ పార్టీ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీ చెప్పారు. తమ మేనిఫెస్టో అత్యంత పారదర్శకమైనదన్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని రాహుల్‌గాంధీ శనివారం ప్రారంభించారు. గోవా ఓ బొగ్గు కేంద్రంగా మారడానికి తాను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోనని రాహుల్‌గాంధీ చెప్పారు. గోవాను కలుషిత ప్రాంతంగా మారనివ్వబోమన్నారు. రాహుల్‌గాంధీ శనివారం వెల్సావోలో మత్స్యకారులతో మాట్లాడారు. గోవాలో అత్యంత ముఖ్యమైనది వాతావరణమేనని, దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడాలని చెప్పారు. ప్రతి ఒక్కరి కోసం మనం పర్యావరణాన్ని కాపాడుతున్నామన్నారు. గోవాను బొగ్గు కేంద్రంగా, కలుషిత ప్రాంతంగా మారనివ్వబోమని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అనేకమందితో సంప్రదింపులు జరిపిన తర్వాత ఎన్నికల ప్రణాళికను రూపొందించామన్నారు. పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించడం, విభజన రేఖ గీయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని రాహుల్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రేమ, అభిమానం నింపుతుందన్నారు. రైతు రుణాలు రద్దు చేస్తామని ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికల్లో వాగ్దానం చేశామని, దానిని నెరవేర్చామని గుర్తుచేశారు. పంజాబ్, కర్ణాటకలకు వెళ్లి తమ పార్టీ మేనిఫెస్టో అమలు గురించి ధ్రువీకరించుకోవచ్చునని తెలిపారు. పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలపై మాట్లాడుతూ యూపీయే ప్రభుత్వ హయాంలో ఓ బ్యారెల్ ముడిచమురు ధర 140 డాలర్లు ఉండేదన్నారు. కానీ నేడు ఈ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో చాలా తక్కువ అయినప్పటికీ, ప్రజలు ఎక్కువ ధర చెల్లిస్తున్నారని చెప్పారు. ఇంధనంపై పన్నులు ప్రపంచ దేశాలతో పోల్చితే మన దేశంలోనే ఎక్కువ అని తెలిపారు. దీనివల్ల లాభపడుతున్నది కేవలం నలుగురైదుగురు వ్యాపారవేత్తలు మాత్రమేనన్నారు. ‘మీ సమయాన్ని వృధా చేయడానికి నేను ఇక్కడికి రాలేదు. నా సమయం వృధా చేసుకోను. ఇతర నాయకుల మాదిరిగా కాకుండా నేను ఇక్కడ ఏమి చెప్పానో..అదే చేస్తాను. గోవాను బొగ్గు క్షేత్రంగా మార్చడానికి నేను ఎంతమాత్రం అంగీకరించేది లేదు. నా విశ్వసనీయతను కాపాడుకోవడం నాకు ముఖ్యం. అందుకే నేను ఇచ్చిన హామీలు అమలు చేసి తీరతాం’ అని రాహుల్ అన్నారు.