పూంచ్‌రాజౌరిలో ఆరవ రోజూ భారీ సెర్చ్ ఆపరేషన్ జమ్ము : ఏడుగురు సైనికులను హత్య చేసిన ముష్కర మూకలను పట్టుకునేందుకు భద్రతాదళాలు గాలింపు చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. జమ్ముకశ్మీర్‌లోని రెండు సరిహద్దు జిల్లాలైన పూంచ్, రాజౌరీ అటవీ ప్రాంతాలలో చేపట్టిన భారీ సెర్చ్ ఆపరేషన్ శనివారం ఆరవ రోజుకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. పూంచ్‌లోని మెంధర్ ప్రాంతంలో సైన్యం, పోలీసుల సంయుక్త గాలింపు బృందాలు ఆపరేషన్ ప్రారంభించడంతో తుపాకీ కాల్పులు వినిపించాయని వారు చెప్పారు. అయితే గాలింపు బృందాల ఊహాజనిత కాల్పులా లేదా ఉగ్రవాదులు ఎదురైనప్పుడు జరిపిన కాల్పులా అనేది వెంటనే స్పష్టంగా తెలియరాలేదని అన్నారు. ఈ పర్వత ప్రాంతం దట్టమైన అడవితో కూడుకుని ఉన్నదని, ఇక్కడ గాలింపు చర్యలు కష్టతరం, ప్రమాదకరమని అధికారులు తెలిపారు. నార్ ఖాస్ అడవుల్లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉత్తరాఖండ్‌కు చెందిన రైఫిల్ మెన్ విక్రమ్ సింగ్ నేగి, యోగంబర్ సింగ్ మరణించడంతో గురువారం నుంచి మెందార్‌లోని విశాలమైన అటవీ ప్రాంతం కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ఉంది. అంతకుముందు, అక్టోబర్ 11న పూంచ్‌లోని సూరంకోట్ అడవిలో భద్రతాదళాల గాలింపు బృందంపై ఉగ్రవాదులు దాడి చేయడంతో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ సహా ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. అదే రోజు, భద్రతాదళాల గాలింపు బృందాలకు, పారిపోతున్న ఉగ్రవాదులకు మధ్య రాజౌరీలోని తన్మండి అడవిలో ఎదురుకాల్పులు జరిగాయి. మెంధర్ నుండి తన్మండి వరకు అటవీ ప్రాంతమంతా కట్టుదిట్టమైన రక్షణలో ఉందని, ఒక ప్రాంతం నుండి మరొక ప్రదేశానికి వెళుతున్న ఉగ్రవాదులను తరిమికొట్టడానికి భారీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. జమ్ము
రాజౌరీ రహదారి వెంట మెంధర్, తన్మండి మధ్య ట్రాఫిక్‌ను రెండో రోజు కూడా నిలిపివేసినట్లు వివరించారు.