రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఎద్దేవా
జైపూర్ : రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మంగళవారం కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాల జ్ఞాపకార్థం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ బదులుగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల రికార్డు పెరుగుదలను చూసినందుకు గుర్తుండిపోతుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ ప్రజలకు దీపావళి కానుకగా ద్రవ్యోల్బణాన్ని ఇచ్చిందని ఆయన ఎద్దేవా చేశారు. ‘పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, వంట నూనె, కూరగాయల ధరలు పెరుగుతున్న తీరును చూస్తుంటే, మోదీ ప్రభుత్వం ప్రజలకు ద్రవ్యోల్బణాన్ని దీపావళి కానుకగా ఇచ్చినట్లు కనిపిస్తోంది’ అని గెహ్లాట్ హిందీలో ట్వీట్ చేశారు. ‘మునుపటి ప్రభుత్వాలు పండుగలకు ముందు ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు ప్రయత్నించాయి. అందువల్ల సామాన్య ప్రజలు పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకునేవారు’ అని తెలిపారు. దీపావళికి మూడు రోజులు ముందు, వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.266కు పెంచడం ద్వారా మిఠాయిలను ఖరీదైనవిగా చేయడానికి మోదీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని ముఖ్యమంత్రి విమర్శించారు. పెట్రోల్ ధర లీటర్‌కు రూ.116, డీజిల్ ధర రూ.108కు పెంచారని, అలాగే ఒక ఏడాదిలో వంట గ్యాస్ ధరను సిలిండర్‌కు రూ.305కు పెరిగి రూ598 నుండి రూ.903కు చేరిందని ఆయన గుర్తు చేశారు. ‘మా ప్రభుత్వం ప్రతిభావంతులైన బాలికా విద్యార్థులకు స్కూటీలు పంపిణీ చేసిందని, కానీ ఇంత ఖరీదైన పెట్రోల్‌ను ఎలా కొనుగోలు చేయగలమని మోదీ ప్రభుత్వాన్ని బాలికలు ప్రశ్నిస్తున్నారు’ అని గెహ్లాట్ పేర్కొన్నారు.