బీజేపీ వ్యతిరేక శక్తులు ఒక్కటవ్వాలి
యోగీ నియంతృత్వ పాలనకు స్వస్తి చెప్పాలి
గుర్తింపు కోల్పోయిన బీఎస్‌పీ..అయినా పొత్తుకు సై
పీటీఐ ఇంటర్వ్యూలో చంద్రశేఖర్ ఆజాద్ మనోగతం
న్యూదిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో బీఎస్‌పీ గుర్తింపు కోల్పోయిందని ఆజాద్ సమాజ్ పార్టీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థల భయంతోనే బీఎస్‌పీ అధినేత్రి మాయావతి కేంద్రం పట్ల మెతక వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మాయా వతి పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని తెలిపారు. బీఎస్‌పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేయడం ద్వారా మాయావతి పార్టీ గుర్తింపు కోల్పో యిందని చెప్పారు. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కొత్తగా ఆజాద్ సమాజ్ పార్టీ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. భీమ్ ఆర్మీ సంస్థ పేరుతో ఆయన అనేక ఉద్యమాలు సాగించారు. దళితులు, ఇతర వెనుకబడిన వర్గాలు, మైనారిటీ హక్కుల కోసం తమ పార్టీ పోరాడు తోందని ఆజాద్ చెప్పారు. ఆజాద్ ఆదివారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక అంశాలను ప్రస్తావించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్‌లో మహాకూటమి ఏర్పడాల్సిన అవసరం ఉందని ఆజాద్ స్పష్టంచేశారు. బీజేపీ తిరిగి అధికారంలోకి రాకూడదని కోరుకుంటున్న పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బీఎస్‌పీతో సహా ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకోవడానికి తనకేమీ అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు. నియంతృత్వ పాలన సాగిస్తున్న యోగి ఆదిత్య నాథ్ ప్రభుత్వాన్ని ఓడిరచడానికి పటిష్ట కూటమి ఏర్పాటే లక్ష్యంగా అన్ని పార్టీలే ఏకం కావాలని కోరుతున్నట్లు ఆజాద్ తెలిపారు. ‘ప్రతిపక్ష పార్టీలన్నీ కూర్చొని మాట్లాడు కోవాలి. రాష్ట్రం, దేశం ఎదుర్కొంటున్న సమస్యల న్నింటిపైనా అన్ని రాజకీయ పార్టీలు చర్చించాలి. మా పార్టీకి సంబంధించి కోర్ కమిటీదే అంతిమ నిర్ణయం. యూపీలో పొత్తులకు మా కోర్ కమిటీ ఇప్పటికే అంగీక రించింది’ అని ఆజాద్ సమాజ్‌పార్టీ చీఫ్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు తమ పార్టీ ఎవరితోనూ పొత్తుపెట్టుకోలేదన్నారు. బీజేపీ నుంచి ప్రజలను రక్షించడానికి మహాకూటమి ఏర్పాటు కోసం తాము ప్రయత్నిస్తున్నామని, యోగీ దుష్టపాలనకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందని ఆజాద్ స్పష్టం చేశారు. బీజేపీ దూకుడును అడ్డుకోవడానికి మహాకూ టమి ఆవశ్యకతను 34 ఏళ్ల ఆజాద్ పునరుద్ఘాటించారు. కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించుకోవడం ద్వారా యూపీలో సంకీర్ణ ప్రభుత్వాన్ని సమర్ధవంతంగా నడపవచ్చని చెప్పారు. అధికారమే పరమావధిగా భావిస్తే నియంతృత్వ ధోరణులు పెరుగుతాయని, ఇప్పుడు యోగీ హయాంలో అదే జరుగుతోందని ఆజాద్ పేర్కొన్నారు. బీఎస్‌పీ అధినేత్రి మాయావతి మీపై నేరుగా విమర్శలు ఎక్కుపెడుతున్నారు గదా అని గుర్తుచేయగా ఆ విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. విమర్శలు, ఆరోపణలకు తాను భయపడబోనని తేల్చిచెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్‌పీతో పొత్తుకు మీరు అంగీకరిస్తారా అని ప్రశ్నించగా బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటితో పొత్తుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆజాద్ చెప్పారు. మాయావతితో తనకు వ్యక్తిగత వైరుధ్యాలు లేవని, కేవలం సైద్ధాంతిక విభేదాలేనని స్పష్టంచేశారు. ‘బీఎస్‌పీ తన గుర్తింపును కోల్పోయింది. ఇది కూడా తనకు తాను చేసుకున్నదే. దీనికి ఎవరో కారణం కాదు. బీఎస్‌పీ రోజురోజుకు క్షీణిస్తోంది. కారణం ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలు. కాన్షీరామ్ సిద్ధాంతాలను బీఎస్‌పీ ఏనాడో పక్కన పెట్టింది. అందుకే రాష్ట్రంలో ఇప్పుడు అస్థిత్వం కోసం పోరాడాల్సి వస్తుంది. 2012 అసెంబ్లీ ఎన్నికలు, 2014 లోక్‌సభ ఎన్నికలు, 2017 అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికలు…ఏవి చూసుకున్నా ఆ పార్టీ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది’ అని రావణ్‌గా పిలవబడే ఆజాద్ వివరించారు. కేరళ, అసోం, పశ్చిమబెంగాల్ వంటి ఏ రాష్ట్రంలో చూసుకున్నా బీఎస్‌పీకి ఒకశాతం కన్నా తక్కువ ఓట్లే వచ్చాయన్నారు. బీఎస్‌పీ నాయకులు క్షేత్రస్థాయిలో పనిచేయకపోవడం వల్లే ఆ పార్టీ క్షీణిస్తోందని తెలిపారు. ఎన్నికల సమయంలోనే ప్రజల వద్దకు వెళ్లడం వల్ల ప్రయోజనం ఉండదన్నారు. ముఖ్యంగా బీఎస్‌పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్‌ను ఆ పార్టీ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు.