రాజ్యసభలో ఆరుగురు టీఎంసీ ఎంపీలపై బుధవారం సస్పెన్షన్ వేటుపడిరది. పెగాసస్ స్పైవేర్‌పై బుధవారం ఉదయం వీరు సభలో రభస సృష్టించినందుకు ఈ చర్య తీసుకున్నట్లు రాజ్యసభ ఓ ప్రకటనలో తెలిపింది. సభలో కార్యకలాపాలు జరుగుతున్న సమయంలో వీరు వెల్‌లో ప్రవేశించారని, ప్లకార్డులు చూపుతూ, అధ్యక్ష స్థానం పట్ల అవిధేయత ప్రదర్శించారని తెలిపింది. పెగాసస్ స్పైవేర్ వివాదంపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం కూడా రాజ్యసభలో టీఎంసీతోపాటు ఇతర విపక్ష ఎంపీలు ఈ అంశంపై చర్చ జరగాలని డిమాండు చేస్తూ నిరసనకు దిగారు. ప్లకార్డులతో వెల్‌లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన విరమించాలని, తమ సీట్లలో కూర్చోవాలని చైర్మన్ వెంకయ్యనాయుడు సూచించారు. లేదంటే ప్లకార్డులు పట్టుకున్నందుకు 255 నిబంధనను అమలు చేయాల్సి వస్తుందని హెచ్చరించినా ఆందోళనను విరమించలేదు. ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టినందుకుగాను డోలా సేన్, మహమ్మద్ నదీముల్ హక్, అబిర్ రంజన్ బిశ్వాస్, శాంత ఛేత్రి, అర్పిత ఘోష్, మౌసమ్ నూర్‌లను చైర్మన్ ఒక రోజు సస్పెండ్ చేశారు.