లక్నో: రైతులకు రుణమాఫీ చేసింది బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వమేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచార కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొన్నారు. రైతులకు బీజేపీ ఎంతగానో చేసిందని, గత ప్రభుత్వ హయాంలో రైతులను దోచుకోవడం తప్పితే చేసిందేమీ లేదని విమర్శించారు. చక్కెర రైతులకు లక్షా 48 వేల కోట్ల రూపాయల చెల్లింపులు చేశామని, ముడి చక్కెర దిగుమతిపై సుంకం విధించడంతో చెరకు రైతులకు ముందస్తు చెల్లింపులు లభించాయని తెలిపారు. చెరకు, చక్కెర ధరలు పెంచామని, ఇథనాల్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి చెరుకు ఫ్యాక్టరీలను ప్రోత్సహించామన్నారు. గత ప్రభుత్వాలను ప్రస్తావిస్తూ అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఎస్పీ, ఎస్పీ ప్రభుత్వాల హయాంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. ఆ ప్రభుత్వాల సమయంలో రైతు ఆత్మహత్యలు అనేకంగా చూసేవాళ్లమని, కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక ఉత్తరప్రదేశ్‌లో అలాంటివేమీ కనిపించడం లేదని అమిత్ షా అన్నారు.