బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ఆదేశాలతో ముడా వ్యవహారంలో విచారణ చేపట్టిన లోకాయుక్త పోలీసులు శుక్రవారం సీఎంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మొదటి ముద్దాయిగా సిద్ధరామయ్యను పేర్కొన్నారు. ఆయన భార్య పార్వతి, బావమరిది మల్లికార్జున్ స్వామితో పాటు మల్లికార్జున స్వామి భూమిని కోనుగోలు చేసిన వ్యక్తి దేవరాజ్ పేర్లను చేర్చారు. సిద్ధరామయ్య, పార్వతి దంపతులు అక్రమంగా భూ ఒప్పందం చేసుకొని లబ్ధి పొందారని, రూ.4వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలను సిద్ధరామయ్య తోసిపుచ్చారు. నిబంధనల ప్రకారం భూ ఒప్పందం జరిగిందని, అవినీతికి తావు లేదని వివరణ ఇచ్చారు. తన రాజీనామా కోసం బీజేపీ డిమాండ్ చేస్తుండటాన్ని తప్పుపట్టారు. రాజకీయపరంగా తనపై నమోదైన మొదటి కేసుగా ముడా వ్యవహారాన్ని ఉద్దేశించి అన్నారు. తనను చూసి బీజేపీ భయపడుతోందని ఎద్దేవా చేశారు. తాను నిర్దోషినని చెప్పారు. ఏ తప్పు చేయలేదని, ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని తెలిపారు. తప్పుడు కేసులో ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐ వంటి సంస్థలతో పాటు గవర్నర్ కార్యాలయాన్ని దుర్వినియోగిస్తోందని విమర్శించారు. రాష్ట్ర పరిపాలన వ్యవహారాల్లో జోక్యం చేసుకున్ అధికారం గవర్నర్‌కు ఉండదని గుర్తుచేశారు. ఎన్నికైన ప్రభుత్వాలను బీజేపీ కూల్చేస్తోందని, కర్నాటకలో అందుకే ప్రయత్నిస్తోందని సిద్ధరామయ్య ఆరోపించారు.