రాహుల్‌తో భేటీ తర్వాత సమస్య పరిష్కారం
సమసిన పంజాబ్ కాంగ్రెస్ వివాదం
న్యూదిల్లీ : పంజాబ్‌లో నవజ్యోత్‌సింగ్ సిద్ధూ వివాదం సమసిపోయింది. దీంతో ఆయన తన రాజీనామాను వెనక్కి తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పంజాబ్ రాష్ట్ర అధ్యక్షుడిగా తాను కొనసాగుతానని సిద్ధూ ప్రకటించారు. తాను పార్టీ ముందు పెట్టిన సమస్యలన్నీ పరిష్కారమయ్యాయని, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగాలని ఆదేశించిందని సిద్ధూ తెలిపారు. సిద్ధూ తన రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పంజాబ్ రాష్ట్ర ఇన్‌చార్జి హరీశ్ రావత్ విలేకరులకు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీతో సిద్ధూ ఆయన నివాసంలో సమావేశమయ్యారు. తన ఆందోళనలు, అభ్యంతరాలు రాహుల్‌తో పంచుకున్నారు. అనంతరం సిద్ధూ రాజీనామాను వెనక్కి తీసుకున్నారు. ‘నాకు ఏమైతే సమస్యలు, ఆందోళనలు ఉన్నాయో…అవన్నీ రాహుల్‌గాంధీకి చెప్పాను. నా సమస్యలన్నీ పరిష్కరించారు’ అని రాహుల్‌తో అరగంట సమావేశం అనంతరం సిద్ధూ విలేకరులకు చెప్పారు. తాను లేవనెత్తిన సమస్యలన్నీ పరిష్కరిస్తానని రాహుల్ భరోసా ఇచ్చినట్లు ఆ తర్వాత ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. సిద్ధూతో పాటు హరీశ్‌రావత్ కూడా రాహుల్‌ను కలిశారు. తాను కష్టపడి పనిచేస్తున్నానని, ఇంకా కష్టపడతానని, పంజాబ్ పార్టీ అధ్యక్షుడిగా విధులు నిర్వహిస్తానని రాహుల్‌కు సిద్ధూ స్పష్టంచేసినట్లు రావత్ వెల్లడిరచారు. పార్టీ నాయకుల వద్ద సిద్ధూ లేవనత్తిన అంశాలను ముఖ్యమంత్రితో మాట్లాడటం తమ కర్తవ్యమని,, ఆ సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. త్వరలోనే ఆ సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. సిద్ధూ గురువారమే రావత్, కేసీ వేణుగోపాల్‌తో సమావేశమై చర్చించారు. పార్టీ నాయకత్వంపై తనకు పూర్తి నమ్మకం ఉందని సిద్ధూ పేర్కొన్నారు. సెప్టెంబరు 28న ట్విట్టర్ వేదికగా సిద్ధూ తన రాజీనామా ప్రకటించారు. పంజాబ్ కొత్త డీజీపీ, అడ్వకేట్ జనరల్ నియామకాలపై సిద్ధూ అసంతృప్తితో రాజీనామా చేశారు. వీటితో పాటు కొత్తమంత్రివర్గంలోకి కొంతమందిని తీసుకోవడాన్ని ఆయన వ్యతిరేకించారు. సిద్ధూ డిమాండుతో ఇప్పటికే డీజీపీని తొలగించారు.