కొవిడ్ సమయంలో హీరో సోనుసూద్ మానవత్వంతో ముందుకొచ్చి ఆపన్నులకు సహాయం చేసి రియల్ హీరోగా మారిన సంగతి తెలిసిందే. ఎంతోమంది హృదయాల్లో సోనూసూద్ చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. కొందరు వారి పిల్లలకు, షాపులకు సోను పేరు పెట్టుకుంటే మరికొందరు ఏకంగా గుడి కట్టేశారు. ఓ మూడవ తరగతి పిల్లాడు సోనుసూద్ కోసం ఏకంగా తన గుండెల్లోనే గుడి కట్టేసుకున్నాడు. న్యాల్‌కల్‌లోని ఎస్సీ కాలనీకి చెందిన పుష్పలతా సిహెచ్ ప్రణయ్‌కుమార్‌ల కుమారుడు విరాట్ హుజూర్‌నగర్‌లోని శ్రీచైతన్య స్కూల్‌లో 3 వ తరగతి చదువుతున్నాడు. సోమవారం రాత్రి విరాట్ ఇంట్లో టీవీలో దూకుడు సినిమా చూస్తున్నాడు. ఆ సినిమా క్లైమాక్స్ ఫైట్‌లో హీరో చేతిలో సోనూసూద్ దెబ్బలు తినడాన్ని జీర్ణించుకోలేని విరాట్, కొవిడ్ సమయంలో ఎంతో మందిని ఆదుకున్న మా సోను అంకుల్‌ను కొడతావా? అంటూ రాయి తెచ్చి టీవీపై విసరడంతో అది బద్ధలైంది. టీవీ ని ఎందుకు పగలగొట్టావురా ? అని కుటుంబ సభ్యులంతా విరాట్‌ను నిలదీశారు. అందరికీ సాయం చేస్తున్న సోను అంకుల్‌ను వేరే వాళ్లు కొడుతుంటే కోపం వచ్చి రాయితో కొట్టాను అంటూ సమాధానమివ్వడంతో ఇంట్లోని వారు షాకయ్యారు. ఇది అందరికీ తెలిసి టీవీల్లో వార్తగా మారి సోనూసూద్‌కు చేరింది. ఆయన ట్విట్టర్‌లో ‘‘మీ టీవీ పగలగొట్టకు, మళ్లీ మీ నాన్న నన్ను కొత్త టీవీ కొనాలని అడుగుతాడు’’ అని ఫన్నీగా స్పందించాడు.