న్యూదిల్లీ : కేంద్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసి ఉండటం, వాక్సిన్లను ఎగుమతి చేయకుండా ఉండి ఉంటే 100 కోట్ల టీకాల ఘనత ఆరు నెలల క్రితమే సాధ్యమై ఉండేదని దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అన్నారు. మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం సిసోడియా కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. సిసోడియా శుక్రవారం ఇచ్చిన ట్వీట్‌లో 100 కోట్ల వాక్సిన్ డోసుల మైలురాయిని దాటినందుకు సంబరాలు చేసుకుంటూనే, మనం ఓ విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం సకాలంలో సరైన ఏర్పాట్లు చేసి ఉంటే, భారతదేశం వాక్సిన్ కొరతను ఎదుర్కొంటున్న సమయంలో టీకా మోతాదులను ఎగుమతి చేయడం వంటి ప్రజాసంబంధాల కార్యకలాపాలు నిర్వహించి ఉండకపోతే, దేశవ్యాప్తంగా ఉన్న వైద్య బృందాలు ఆరు నెలల క్రితమే ఈ మైలురాయిని అధిగమించి ఉండేవని తెలిపారు. వాక్సినేషన్ ప్రారంభమైనప్పటి నుంచి అక్టోబరు 21 ఉదయం 10 గంటల వరకు 100 కోట్ల మోతాదులను ప్రజలకు ఇచ్చి, చరిత్ర సృష్టించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. వాక్సినేషన్ విజయవంతమవడానికి కారణం భారత ప్రజలేనని మోదీ శుక్రవారం తెలిపారు.